ఆల్రెడీ 'సౌందర్యలహరి' అంటూ కొన్నాళ్లు నడిపించారు.. అక్కడంతా జరిగిన చర్చ ఏమిటయ్యా అంటే, ఆ హీరోయిన్ బొడ్డు మీద ఈ పండుతో ఎందుకు కొట్టాలనిపించింది? ఈ హీరోయిన్ పెదవిని ఆ పువ్వుతోనే ఎందుకు కొట్టారు? వంటి అంశాల గురించినే. ఇక ఆ షోకు హాజరైన నటీమణులు తమకు బామ్మల వయసు వచ్చినా.. 'రాఘవేంద్రరావుగారు చిలిపికృష్ణుడు..' అంటూ మాట్లాడుతుంటే.. వీటన్నింటినీ చూసి తట్టుకోవడం సామాన్య ప్రేక్షకుడికి సాధ్యం కాకపోయింది.
అంతవరకూ మౌనమునిగా పేర్గాంచిన రాఘవేంద్రరావు తొలిసారి పెదవి విప్పుతున్నారని.. తమ సినిమాల గురించి మాట్లాడతారని.. బాగా హడావుడి చేసి ఆ కార్యక్రమాన్ని రన్ చేశారు. ఆయన గడ్డం పొడవుగా పెంచుతారని 'మని' అని కొంతమంది సినీ జనాలు కితాబులు ఇచ్చినట్టున్నారు. అయితే తీరా ఆయన మాట్లాడటం మొదలుపెట్టాకా.. ఇదేనా చెప్పదలుచుకున్నది? అనే ప్రశ్నే ఉత్పన్నం అయ్యింది. వంద సినిమాలకు పైగా తీసిన దర్శకుడితో చెప్పించదలుచుకున్నది ఇదేనా? పూలెట్టి.. పండెట్టి కొట్టించడం గురించినే?
శృంగారం గురించి డిస్కషన్ చేస్తే.. టీవీలకు ప్రేక్షకులు అతుక్కుపోవడం నిజమే కానీ, ఎవరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు.. అనే విషయాలను జనాలు గమనిస్తారు. రాఘవేంద్రుడు తెరపై పండించిన శృంగారాన్ని, హీరోయిన్లను అందంగా చూపడాన్ని ఏ మిడ్‌నైట్ మసాలా ప్రోగ్రామ్‌గా వేస్తే.. దానికి వ్యూస్ బ్రహ్మాండంగా ఉంటాయి.
రాఘవేంద్రరావు రసవత్తరంగా తీసిన శృంగార గీతాలను రాత్రి పొద్దు పోయిన తర్వాత ప్రసారం చేస్తే.. ఆ ప్రోగ్రామ్ బ్రహ్మాండంగా హిట్ అవుతుంది. ఆల్రెడీ.. కొన్ని చానళ్లు అదే పని చేస్తున్నాయి. 11తర్వాత మ్యూజిక్ చానళ్లు, ఇతర ఎంటర్‌టైన్ మెంట్ చానళ్లలో శృంగార రసగీతాలుగా ప్రసారమయ్యే గీతాల్లో రాఘవేంద్రరావు సినిమాల వాటా ముందుంటుంది.
మరి అవే పాటలనే క్లాసిక్స్‌గా చూపించేస్తూ.. హీరోయిన్‌కి పూలతో మొలత్రాడు కట్టడం అత్యద్భుతమైన క్రియేటివిటీ అయినట్టుగా కీర్తనలు అందించేస్తూ.. 'సౌందర్యలహరి' అనే కార్యక్రమం పూర్తి అయ్యింది. ఆ ముచ్చటంతా అలా ఉంటే.. ఇప్పుడు 'సై సై సైయ్యారే..' అంటూ ఇంకోటి. ఈసారి ఏంటయ్యా.. మళ్లీ అదే గొడవే. అవే పాటలు… అవే పూలు, అవే పళ్లు!
కొన్ని ఎపిసోడ్స్‌గా ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత ఇంతకీ వీళ్లు ఏం చెప్పదలుచుకుంటున్నారు? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. వంద సినిమాలకుపైగా తీసిన దర్శకుడిని కూర్చోబెట్టి.. పిచ్చాపాటిగా మాట్లాడినా అందులో ఎన్నో ఆసక్తిదాయకమైన విషయాలు వెల్లడి అవుతాయి. వాళ్ల అనుభవం, స్టార్ హీరోలతో పనిచేసిన నేపథ్యం… ఇలా ఏం మాట్లాడినా అది సబ్జెక్టే అవుతుంది, సినీ ప్రియులకు ఆసక్తిదాయకమైన అంశమే అవుతుంది. అయితే రాఘవేంద్రరావును మాత్రం కేవలం బూతు పాటలకు పరిమితం చేశారు పాపం.
ఇక్కడ మరింత కామెడీ ఏమిటంటే.. ఆల్రెడీ రాఘవేంద్రరావు చిత్రీకరించిన పాటను.. మళ్లీ కంపోజ్ చేయిస్తూ ఉండటం. రాఘవేంద్రరావు అప్పుడు అలా తీశాడు.. ఇప్పుడైతే ఎలా తీస్తారు అంటూ.. పేరడీ చిత్రీకరణ ఒకటి చూపిస్తారు. ఈ పేరడీ చిత్రీకరణకూ రాఘవేంద్రరావుకు సంబంధం ఉండదన్నమాట. ఎవరో నేటితరం డ్యాన్స్ మాస్టర్ దీన్ని కంపోజ్ చేస్తాడు.
వీళ్లు ఇక రెచ్చిపోవడమే.. దొరికిందే తడవుగా.. పాత బూతుకు మరింత ఘాటును తగిలించి.. ఎంతవీలైతే అంత అసభ్య భంగిమలతో డ్యాన్సులు చేస్తే.. అమ్మాయిలను అంత వీలైతే అంత దారుణంగా చూపుతూ.. వీళ్లు రెచ్చిపోతారన్నమాట. వీళ్లు చేసే డ్యాన్సుల్లో కానీ, వీళ్ల కంపోజిషన్‌లో కానీ నవ్యత మాట దేవుడు ఎరుగు.. వీళ్లకన్నా ఊర్లలో రికార్డింగ్ డ్యాన్సులు వేసుకునే వాళ్లు మేలు కదా.. అనే భావన కలుగుతుంది.
ఈ చీప్ డ్యాన్సులకు రాఘవేంద్రరావు ప్రశంసలు అదనం. అలాగే ఈ కార్యక్రమానికి గెస్టు కూడా ఉంటారండోయ్. తెలుగురాని హీరోయినో.. ఎవరో ఒకరిని తెచ్చి అక్కడ కూర్చోబెడతారు. ఇక వాళ్లు వ్యక్తపరిచే అమాయకత్వాలు, యాంకర్లు రాఘువేంద్రరావును అసబద్ధంగా పొగిడేయడాలు.. ఇవన్నీ కలిసి.. ఈ ప్రోగ్రామ్‌ను ప్రహసంగా మార్చి.. ఆ ప్రహసనాన్నే పతాక స్థాయికి తీసుకెళ్లుతున్నాయి.
ఒక దర్శకుడు వంద సినిమాలు తీయడం అంటే మాటలు కాదు.. అది ఏ జనరేషన్లో అయినా నిస్సందేహంగా గొప్పదనమే. అలాంటి వంద సినిమాలతో కూడా తన ప్రత్యేకతను నిరూపించుకున్నాడు రాఘవేంద్రరావు. లాజిక్కులకు దూరంగా ఉంటాయి, మిగతా తెలుగు దర్శకులతో పోలిస్తే విజయాల శాతం తక్కువ.. అనే విమర్శలు ఉంటే ఉండవచ్చు. కానీ.. ఆయనను కూర్చోబెట్టి ఒక షో నడిపిస్తే.. మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కో సినిమా గురించి ఒక్కో షో నిర్వహించి.. ఆ సినిమాకు పనిచేసిన వాళ్లనూ కూర్చోబెట్టి.. ఆ సినిమా సమయంలో వీళ్ల అనుభవాలన్నింటినీ మాట్లాడిస్తే.. షో అదిరిపోతుంది.
అంతేకానీ.. ఏదో సెక్స్‌ను సేల్ చేసుకుందామనే చీప్ ట్రిక్స్‌తో.. ఇలాంటి చిల్లర ఎత్తుగడలు వేసి… ప్రోగ్రామ్‌లు నడిపించడం ఏ మాత్రం ఔచిత్యం అనిపించుకోదు. రాఘవేంద్రరావును విమర్శించే వాళ్లు ఒకేమాటే అంటూ ఉంటారు.. ఏముంటుందండీ ఆయన సినిమాల్లో.. పూలు, పళ్లు, బోడ్డు షోలు తప్ప అని… ఈ టీవీ షోలు చూశాకా.. రాఘవేంద్రరావు ఇమేజ్‌ను నిజంగానే పూలు, పళ్లు , బొడ్డుకు పరిమితం చేస్తున్నట్టున్నారు అనిపిస్తోంది. రాఘవేంద్రరావు శ్రేయోభిలాషులే ఈ పని చేస్తున్నారు.
అవతల ఈ బొడ్డు మీద పళ్లతో విసురడంతో నొప్పిపుట్టి చచ్చామని యంగ్ హీరోయిన్లు ఓపెన్‌గానే వాపోతుంటే.. ఇలాంటి సమయంలో ఆ క్రియేటివిటీకి పటాలు కట్టించి.. దండేసి, దండం పెట్టడమా.. హతవిధీ!