తన సినిమాల విడుదల అనేది తన చేతుల్లో లేదని నిస్సహాయత వ్యక్తం చేశాడు హీరో గోపిచంద్. ఈ మధ్య కాలంలో గోపిచంద్ సినిమాలు సకాలంలో విడుదల కాని సంగతి తెలిసిందే. ముందుగా ఆరడుగుల బుల్లెట్ సినిమా ఈ హీరోని ముప్పుతిప్పలు పెట్టింది. బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా రెండు మూడు సంవత్సరాల పాటు నడిచింది. చివరకు ఎలాగో విడుదల అయ్యింది. అయితే ఈ సినిమా విడుదల అయ్యిందని చాలా మందికి తెలియనే లేదు.
మొదట ఏదో టైటిల్ అనుకున్నారు.. చివరకు ఆరు అడుగుల బుల్లెట్ అనే టైటిల్ తో విడుదల అయ్యింది వెళ్లిపోయింది. ఇక ఆక్సిజన్ కథ కూడా దాదాపు అలాంటిదే. ఈ సినిమా 2015 డిసెంబర్ లో మొదలైంది. పెద్దకుమారుడు జ్యోతిని దర్శకుడిగా నిలబెట్టాలన్న యత్నాలను కొనసాగిస్తున్న ఏఎం రత్నం అప్పట్లో ఈ సినిమాను మొదలుపెట్టాడు. ఇది కచ్చితంగా రెండేళ్లకు విడుదలకు సన్నద్ధం అవుతుంది. మరి ఇప్పటికైనా విడుదల అవుతున్నందుకు గోపిచంద్ కాస్తా ఆనంద పడుతున్నాడు.
ఈ రెండు సినిమాల విషయంలోనే కాదు.. గౌతమ్ నందా కూడా సరైన పబ్లిసిటీ లేకుండా పోయిందని గోపిచంద్ అంటున్నాడు. ఆ సినిమా బాగానే ఉంటుందని.. సరైన రీతిలో ప్రమోషన్ లేకే ఆ సినిమా ఫెయిల్ అయ్యిందని అంటున్నాడు. ఆరు అడుగుల బుల్లెట్ సినిమా తీసిన నిర్మాతను నమ్మడం తన పొరపాటు అని అంటున్నాడు ఈ హీరో. ఈ విధంగా తన సినిమాల విషయంలో నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నాడు ఈ హీరో. మరి ఆక్సిజన్ విజయం సాధించి వరస ప్లాఫుల్లో ఉన్న ఈ హీరోకి ఆనందాన్ని ఇస్తుందేమో చూడాలి.