ఎన్నికలకు ఇక తొమ్మిది నెలల గడువు మాత్రమే వుంది. దీంతో ఏ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారనే విషయమై పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్సార్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి రాజకీయ అడుగులపై చర్చిస్తున్నారు. మైదుకూరు నుంచి జనసేన తరపున డీఎల్ రవీంద్రారెడ్డి బరిలో వుంటారనే టాక్ నడుస్తోంది.
2014 -19 మధ్య కాలంలో డీఎల్ రవీంద్రారెడ్డిలో టీడీపీలో ఉన్నారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. అయితే టీడీపీ, వైసీపీలలో ఆయనకు తగిన ప్రాధాన్యం దక్కలేదు. ప్రస్తుతం ఆయన సీఎం వైఎస్ జగన్‌ను తిడుతూ కాలం గడుపుతున్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశ ఆయనలో రోజురోజుకూ పెరుగుతోంది. టీడీపీ, జనసేనలకు అనుకూలంగా ఆయన మాట్లాడుతున్నారు.
టీడీపీ తరపున ఇప్పటికే పుట్టా సుధాకర్ యాదవ్‌కు మైదుకూరు టికెట్ ఖరారు చేశారు. ఇప్పటికే ఆయన ఒకట్రెండు దఫాలు టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ దఫా ఎలాగైనా గెలుస్తానని ఆయన ధీమాతో ఉన్నారు. పుట్టా సుధాకర్ యాదవ్‌ను కాదని డీఎల్ రవీంద్రారెడ్డికి టీడీపీ టికెట్ ఇచ్చే అవకాశం లేదు. దీంతో డీఎల్ జనసేనలో చేరి, ఆ పార్టీ తరపున పోటీ చేస్తారనే చర్చ కడప జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతోంది.
జనసేన-టీడీపీ పొత్తులో భాగంగా డీఎల్ బరిలో వుంటారని అంటున్నారు. అయితే డీఎల్ రవీంద్రారెడ్డి ఔట్‌డేటెడ్ పొలిటీషియన్ అని, ఆయనకు అంత సీన్ లేదనే వాళ్ల సంఖ్య తక్కువేం కాదు.