టీడీపీకి ఇది అవమానకరం. యువగళం పేరుతో పాదయాత్ర చేసుకుంటూ వస్తున్న నారా లోకేశ్ దృష్టిలో పడేందుకు టీడీపీ నేతలు భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేయడం తెలిసిందే. అయితే లోకేశ్ రాకను పురస్కరించుకుని కట్టిన ప్లెక్సీలకు డబ్బు ఇవ్వలేదంటూ ఒక వ్యక్తి ఏకంగా సోమవారం స్పందన కార్యక్రమంలో ఎస్పీకి ఫిర్యాదు చేయడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. బాధిత దుకాణం యజమాని తన ఆవేదనను మీడియాతో పంచుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్లెక్సీలకు డబ్బు ఇవ్వలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ మహిళా నాయకురాలు, మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్, తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి కావడం గమనార్హం. లోకేశ్ యువగళం పాదయాత్ర నంద్యాల, ఆళ్లగడ్డకు చేరిన సందర్భంలో ప్లెక్సీలు కట్టేందుకు నంద్యాలకు చెందిన బొల్లెద్దుల సూరితో కలిసి కె.వేణుగోపాల్,
మే నెలలో నంద్యాల, ఆళ్లగడ్డలో లోకేశ్ పాదయాత్రను పురస్కరించుకుని ప్లెక్సీలు, బ్యానర్లు, స్టిక్కర్లు, టీ షర్టులు,జెండాలు తయారు చేసేందుకు నంద్యాల టీడీపీ కార్యకర్త బొల్లెద్దుల సూరి తనను అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ దగ్గరికి తీసుకెళ్లి ఒప్పందం కుదుర్చుకున్నట్టు లక్ష్మి డిజిటల్ ప్రొప్రైటర్ కె.వేణుగోపాల్ తెలిపారు. ఈ వర్క్ విలువ రూ.5.85 లక్షల అని ఆయన చెప్పారు. ఇందుకోసం రూ.4.25 లక్షలను తొమ్మిది విడతల్లో ఇచ్చారన్నారు. మిగిలిన మొత్తం ఇవ్వాలని అడగ్గా…ఇదిగో, అదిగో అంటూ కాలయాపన చేశారన్నారు. చివరికి ఇచ్చేది లేదని, ఏం చేసుకుంటావో చేసుకోపో అని వార్నింగ్ ఇచ్చినట్టు ఆయన అన్నారు.
పోలీసులకు ఫిర్యాదు ఇస్తానని టీడీపీ కార్యకర్త సూరితో చెప్పగా, వాళ్ల సంగతి తెలియదని, ఎత్తుకెళ్తారని హెచ్చరించినట్టు అతను వాపోయారు. దీంతో నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డికి స్పందనలో ఫిర్యాదు చేసినట్టు అతను అన్నారు. టూటౌన్‌కు ఎస్పీ రెఫర్ చేసినట్టు అతను చెప్పారు. అఖిలప్రియను అడిగితే అన్న వచ్చిన తర్వాత సెటిల్‌మెంట్ చేస్తాడని చెప్పారన్నారు. విఖ్యాత్‌ను అడిగితే బావ వచ్చిన తర్వాత చేస్తాడన్నారని ఆయన అన్నారు.
బావ వచ్చిన తర్వాత కనీసం తనను లోపలికి కూడా రానివ్వలేదని ఆయన వాపోయారు. అఖిలప్రియ పీఏ మహేశ్ తనను, తన భార్యను తిట్టాడని, ఇంటి నుంచి బయటికి గెంటేశాడని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని ఆయన వేడుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. లోకేశ్ పాదయాత్రకు కట్టిన ప్లెక్సీలు, ఇతరత్రా వాటికి అయిన ఖర్చును ఇవ్వకుండా ఏడ్పించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.