సునీల్‌ డిప్రెషనా, రియలైజేషనా?

ఒకప్పుడు బొద్దుగా 'బంతి'లా వుండే సునీల్‌ చేసిన కామెడీ ప్రేక్షకులని ఎంతగా నవ్వించిందనేది ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అయితే హీరోగా మారిన తర్వాత ముందు సన్నబడి, తర్వాత సిక్స్‌ ప్యాక్‌ చేసి ప్రేక్షకులకి…

ఒకప్పుడు బొద్దుగా 'బంతి'లా వుండే సునీల్‌ చేసిన కామెడీ ప్రేక్షకులని ఎంతగా నవ్వించిందనేది ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అయితే హీరోగా మారిన తర్వాత ముందు సన్నబడి, తర్వాత సిక్స్‌ ప్యాక్‌ చేసి ప్రేక్షకులకి నచ్చిన తన స్వరూపాన్నే మార్చేసుకున్నాడు. దీంతో సునీల్‌ హీరోగా నటించిన సినిమాల్లో మునుపటి కమెడియన్‌ కనిపించక ప్రేక్షకులు తిరస్కరిస్తూ వచ్చారు.

ఈ విషయాన్ని రియలైజ్‌ అయ్యాడో, లేక ఇటీవల వస్తోన్న వరుస పరాజయాలకి డిప్రెషన్‌కి గురయ్యాడో కానీ సునీల్‌ మళ్లీ చాలా బొద్దుగా తయారయ్యాడు. మళ్లీ అతనిలో 'మనసంతా నువ్వే' టైమ్‌లోని సునీల్‌ కనిపిస్తున్నాడు. అయితే హీరోగానే కొనసాగుతానంటూ కమెడియన్‌ అవకాశాలన్నీ కాలదన్నుకున్న సునీల్‌ తన ఆబ్సెన్స్‌లో చాలా మంది కమెడియన్లని ఎదగనిచ్చాడు.

సునీల్‌ కామెడీ మానేసిన తర్వాత ఫీల్డులోకి వచ్చిన వారిలో నలుగురైదుగురు కమెడియన్లు ఇప్పుడు టాప్‌లో వున్నారు. తిరిగి కామెడీ వేషాలు వేస్తాను కానీ తన పాత్రకి ప్రాధాన్యత వుండాలంటూ సునీల్‌ ప్రస్తుతం కండిషన్లు పెడుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. కమెడియన్‌గా ఎక్కువ ఛార్జ్‌ చేసినా, ఫలానా పాత్రలే చేస్తానంటూ మొండికేసినా మరో కమెడియన్‌ని పెట్టుకోవడానికి ఇప్పుడు చాలా ఆప్షన్లున్నాయి. ఈ నేపథ్యంలో సునీల్‌ ముందు ముందు తన కెరీర్‌ని ఎలా మలచుకుంటాడనేది ఆసక్తికరం.