చిన్న సినిమాలు, థియేటర్ల వివాదం మరొసారి తెరమీదకు వచ్చింది. వరుసపెట్టి సినిమాలు విడుదలవుతుండడంతో థియేటర్ల సమస్య తలెత్తుతోంది. గతవారం మూడు సినిమాలు విడుదలయ్యాయి. ఈవారం ఏకంగా నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. అంతకు ముందు విడుదలైన ఉన్నది ఒకటే జిందగీ ఇంకా థియేటర్లలో వుంది. ఇవి కాక వేరేవి వుండనే వున్నాయి. దీంతో థియేటర్ల సమస్య తలెత్తుతోంది.
గతవారం విడుదలయిన ఏంజెల్ సినిమాకు ఇప్పుడు కూకట్ పల్లి లోని శివపార్వతి థియేటర్ తో వివాదం తలెత్తింది. ఏంజెల్ కోసం రెండు వారాలకు థియేటర్ ను రెంటల్ బేసిస్ మీద అగ్రిమెంట్ చేసుకున్నారు. రెండు వారాల రెంటల్ తీసేసినా కూడా ఇంకా షేర్ వస్తోందట.
ఇలా షేర్ వస్తుండగా, అదిరింది సినిమా కోసం దాన్ని తీసేసే ప్రయత్నం జరుగుతోందట. ఈ విషయం తెలిసి, ఏంజెల్ నిర్మాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము అగ్రిమెంట్ చేసుకున్నాము, వాళ్లు అడిగిన రెంట్ ఇస్తున్నాము, షేర్ వస్తోంది. అలాంటపుడు చెప్పా పెట్టకుండా సినిమా తీసేయడం ఏమిటి అని ఏంజెల్ యూనిట్ ఫ్రశ్నిస్తోంది.
సినిమా రంగంలో అంతో ఇంతో అనుభవం వున్న తమకే ఇలా చేస్తే, చిన్న నిర్మాతలు, కొత్త నిర్మాతల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో అవసరం అయితే న్యాయపోరాటానికి వెనుకాడమని అంటున్నారు. మరి థియేటర్ యాజమాన్యం ఏం చేస్తుందో చూడాలి.