సందీప్ కిషన్ హీరోగా తెలుగు తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం కేరాఫ్ సూర్య. నాపేరే శివ చిత్రానికి గతంలో దర్శకత్వం వహించిన సుశీంద్రన్ దీనిని రూపొందిస్తున్నారు. స్వామి రారా చేసిన చక్రి చిగురుపాటి దీనికి నిర్మాత. 10వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి.. స్టోరీ పాయింట్ లీక్ అయింది. ఈ చిత్రం అచ్చంగా ఇదే దర్శకుడు గతంలో తీసిన ‘నా పేరే శివ’ చిత్రం మాదిరిగానే ఉంటుందని తెలుస్తుంది. సింగిల్ లైన్ లో చెప్పాలంటే.. ఆ చిత్రానికి సీక్వెల్ లాగా ఇది ఉంటుందని అంటున్నారు. బుధవారం నాడు చెన్నైలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోను కూడా ప్రదర్శించారు.
లీక్ అయిన స్టోరీ పాయింట్ ఏమిటంటే…
సూర్య అనే సందీప్ కిషన్ ఓ మధ్య తరగతి కుటుంబంలోని కుర్రాడు. అదే మధ్యతరగతిలోని మరో కుర్రాడితో ఇతనికి గట్టి స్నేహం ఉంటుంది. ఆ ఫ్రెండు కోసం ఏమైనా చేసేలాగా ఉంటాడు. అయితే.. సూర్య ఇంట్లో నిత్యం అతడికి తల్లిదండ్రులనుంచి తిట్టు వస్తుంటాయి. ఫ్రెండ్ వల్లే చెడిపోతున్నాడని అంతా అంటుంటారు. సందీప్ పట్టించుకోడు. అయితే మొత్తానికి ఇంట్లో నస భరించలేక సూర్య తన ఫ్రెండుతో కటీఫ్ చెప్పేస్తాడు. అతడి నుంచి దూరం అవుతాడు.
అయితే వారిద్దరూ విడిపోయిన తర్వాత ఫ్రెండుకు ఒక కష్టం వస్తుంది. ఆ సమస్యనుంచి అతడిని బయటపడేయడానికి మాత్రం సూర్య చొరవ చూపిస్తాడు. నేను వాడితో మాట్లాడకపోవచ్చు గానీ.. వాడు మాత్రం నా ఫ్రెండే అనేది అతడి కాన్సెప్టు. తన ఫ్రెండు సమస్యను దూరం చేయడానికి యాక్షన్ లోకి దిగుతాడు. విలన్లతో వైరం పెట్టుకుంటాడు. ఫ్రెండుతో కలవకుండానే.. అతడిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అతడిమీద ఈగ వాలనివ్వడు. ఆ రకంగా.. అతడి మీదికి ఎవరొచ్చినా ఊరుకోనని, అతడు ‘కేరాఫ్ సూర్య’ అని హెచ్చరిస్తూ.. సినిమా టైటిల్ ఎస్టాబ్లిష్ చేస్తాడు.
హీరోయిన్ విషయానికి వస్తే.. డిగ్రీ పాస్ అయ్యానంటూ అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగే అమ్మాయి యాక్సిడెంటల్ గా సూర్యకు పరిచయం అవుతుంది. ఆ తర్వాత తరచూ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అలా యాక్షన్ ఎపిసోడ్స్ కు పారలెల్ గా వీరి ప్రేమ కథ నడుస్తుంటుంది.
అయితే ఈ కథ ఇంచుమించుగా ‘నా పేరే శివ’ చిత్రాన్ని పోలినట్లుగానే ఉన్నదనే కామెంట్లు తమిళ పరిశ్రమ నుంచి వినిపిస్తున్నాయి. బుధవారం ప్రీమియర్ షో ప్రదర్శించిన తర్వాత.. ట్విటర్ లో మాత్రం కామెంట్లు వెల్లువెత్తాయి. టీం చాలా బాగా చేశారని, సుశీంద్రన్ మరో చక్కటి సినిమా రూపొందించాడని ట్వీట్లు వస్తున్నాయి. ట్వీట్ల ప్రకారం అయితే.. లక్ష్మణ్ కెమెరా పనితనానికి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.