మెగా కాంపౌండ్ చుట్టూ ఇండస్ట్రీ చక్కర్లు!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘సైరా’ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం ఇంకా పూర్తిస్థాయిలో సెట్స్ మీదకు వెళ్లలేదు. రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. మరో రకంగా చెప్పాలంటే.. కథ విషయం ఫైనల్ అయింది గానీ..…

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘సైరా’ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం ఇంకా పూర్తిస్థాయిలో సెట్స్ మీదకు వెళ్లలేదు. రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. మరో రకంగా చెప్పాలంటే.. కథ విషయం ఫైనల్ అయింది గానీ.. మెగాస్టార్ చిత్రానికి ప్లాన్ చేసినంత భారీ బడ్జెట్, భారీ హంగులకు తగినట్లుగా క్యాస్టింగ్.. నటీనటుల ఎంపిక పర్వం కూడా ఇంకా పూర్తికాలేదు. ఈ చిత్రాన్ని భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు ఉండే చిత్రంగా రూపొందించాలని అనుకుంటున్నారు.

హిందీలోను, ఇతర భారతీయ భాషల్లోను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నందున ఆయా భాషలకు చెందిన నటీనటుల్ని కూడా తీసుకునే అవకాశం చాలా ఉంది. ఇలాంటి నేపథ్యంలో.. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో ఏదో ఒక పాత్రలో తాము కూడా కనిపిస్తే చాలుననే ఆశ చాలా మందికి కలగడం సహజం. అందుకే ఇప్పుడు దాదాపుగా మొత్తం తెలుగు ఇండస్ట్రీ మెగాకాంపౌండ్ చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లుగా ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

సైరా చిత్రంలో ఒక పాత్ర చేయడం కోసం చాలామంది నటుల్లో ఆరాటం ఉంది. ఇది స్వాతంత్ర్య పోరాట కాలానికి సంబంధించిన చారిత్రక నేపథ్యం గల సినిమా కావడంతో.. ఇందులో పాత్రలకు కొదువ ఉండదని… ఏ చిన్నపాత్ర పోషించినా.. దానికంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని అందరూ ఆశిస్తున్నారట. ఏదో ఒకపాత్రను తమను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుతూ.. మెగాస్టార్ చిరంజీవిని, నిర్మాత రాంచరణ్ ను ఆశ్రయిస్తున్నారట. 

చిన్న నటులు ఓ పాత్ర అయినా చాలుననే ఆశతో రావడంలో వింతేమీలేదు. కానీ సీనియర్లు హీరో స్థాయిలోనూ వారు కూడా పలువురు అతిథిపాత్రల మీద మక్కువ చూపిస్తుండడం ‘సైరా’ సినిమాకు ఓ ప్లస్ పాయింట్ లా మారుతోంది. నిజానికి హీరో పాత్రలు వేయడం ప్రారంభించిన తర్వాత.. పెద్ద సినిమాల్లో కమెడియన్ పాత్రలు వచ్చినా కూడా.. మొండిగా తిరస్కరిస్తూ వచ్చిన సునీల్ లాంటి వాళ్లు కూడా ఈ చిత్రంలో ఒక పాత్ర చేస్తాం అంటూ తమంతగా వచ్చి ఆఫర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 

రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాత. సురేందర్ రెడ్డి దర్శకుడు. దర్శకుడు సినిమా పని ప్రారంభించి చాలాకాలమే అయింది. ముహూర్తం కూడా చిరు బర్త్ డే రోజున చేసేశారు. అయితే.. కథకు తుది మెరుగులు పేరిట ఇంకా కసరత్తు చేస్తూనే ఉన్నారు. మరి ఈ క్యాస్టింగ్ వ్యవహారాలు మొత్తం ఫైనలైజ్ చేసుకుని.. ఎప్పటికి రెగ్యులర్ వర్క్ లో పడతారో? ఏమిటో?