మూతి మీద మూతి ఉంచి పెట్టుకునే ముద్దులకు, అదేనండీ ఫ్రెంచి కిస్సులకు యూత్ లో బాగానే క్రేజ్ ఉంటుంది. అయితే ఇలాంటి బూతు ముద్దులు.. సారీ, మూతి ముద్దులు.. తెరమీదకు వస్తే జనం ఆమోదిస్తున్నారు గానీ.. పోస్టరు మీదికి వస్తే ఆమోదించే స్థాయికి ఇంకా ఎదగలేదు. దాని మీద ఏదో ఒక రాద్ధాంతం చేస్తున్నారు.
అలాంటి ఇబ్బంది ఇప్పుడు ప్రయోగాత్మకంగా యూత్ ఫిలిం ముద్రతో రూపొందుతున్న లవర్స్ క్లబ్ సినిమాకు కూడా ఎదురవుతోంది. అయితే తమ సినిమాలను మార్కెటింగ్ చేసుకోవడానికి బూతు మార్గాన్ని అనుసరించడం తప్ప చిన్న సినిమాలకు వేరే గతిలేదా.. అనే చర్చ ఇప్పుడు ఫిలిం నగర్లో జరుగుతోంది.
చిన్న సినిమాలు అంటేనే వాటికి సవాలక్ష సమస్యలు ఉంటాయి. ఒకసారి చిన్న సినిమా ముద్ర పడిన తర్వాత, కొత్త వాళ్లతో సినిమా తీస్తున్నప్పుడు, అది పూర్తి కావడమే గగనం. కిందా మీదా పడి పూర్తి చేసినా.. సరే.. విడుదలకు నోచుకోవడం అంత ఈజీ కాదు. పబ్లిసిటీ ఖర్చులను భరించడం ఇంకా తలకు మించిన భారం.
కొన్ని సినిమాలకు- సినిమా నిర్మాణం ఖర్చు కంటె పబ్లిసిటీ ఖర్చులె ఎక్కువ అవుతాయంటే అతిశయోక్తి కాదు. పోనీ ఇన్ని పాట్లు పడి రిలీజ్ కు సిద్ధంచేస్తే థియేటర్లు దొరకవు.. ఇన్ని విఘ్నాలు ఉంటాయి. ఈ విఘ్నాలన్నీ దాటగలిగినా.. థియేటర్ కు ప్రేక్షకుడిని రప్పించడం అంటే వారికి తల ప్రాణం తోకకు వస్తుంది.
అయితే అందుకు చిన్న సినిమాలు షార్ట్ కట్ లను కనుక్కుంటున్నాయి. సినిమా పిచ్చ రొమాంటిక్ గా ఉన్నట్టుగా ప్రచారంలో కాస్త బూస్ట్ చేసుకోవడం.. కాస్త బూతు కలర్ ఇచ్చి.. యూత్ ను రెచ్చగొట్టే పబ్లిసిటీ స్ట్రాటజీతో వెళ్లడం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా తీస్తున్న లవర్స్ క్లబ్ చిత్రం కూడా అలాగే అవుతున్నట్లు తెలుస్తోంది. కేవలం రొమాంటిక్ చిత్రం అనే బిల్డప్ కోసం.. మౌత్ కిస్ లు, మోహంతో వెర్రెత్తిపోతున్నట్టుగా ఉన్న బొమ్మలతో ఈ చిత్రం పోస్టర్లను చేసినట్లుగా అర్థమవుతోంది.