ప్రస్తుతం టూ కంట్రీస్ సినిమా ఫినిష్ చేసి, తరువాతి ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్నాడు హీరో కమ్ కమెడియన్ సునీల్. తమిళ సినిమా చతురంగ వేట్టై తెలుగులో చేయాల్సి వుంది. కానీ నిర్మాత కృష్ణ ప్రసాద్ కు సునీల్ కు సరిగ్గా ఐడియాలు మ్యాచ్ కాకపోవడంతో, ఆ ప్రాజెక్టు అలా వుండిపోయింది. ఇప్పుడు మరో మాంచి క్రేజీ ప్రాజెక్టు సునీల్ కు వచ్చినట్లు తెలుస్తోంది.
బాహుబలి కథకుడు, రాజన్న దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ ఓ మాంచి కథను తయారు చేసారట. గతంలో మర్యాదరామన్న కథను అందించింది ఆయనే. ఈ కథను సునీల్ కు వినిపించినట్లు తెలుస్తోంది. ఓ కార్పొరేట్ సంస్థకు రెండు సినిమాలు చేయడానికి విజయేంద్ర ప్రసాద్ అగ్రిమెంట్ చేసుకున్నారు. అందులో భాగంగా ఈ సినిమాను సునీల్ తో చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. అయితే ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తారు. వేరే దర్శకుడిని సెట్ చేసుకుంటారు.
టూ కంట్రీస్ విడుదలకు రెడీ కావడం, ఈ కొత్త సినిమా ఫిక్స్ అయ్యే సూచనలు, మెగా సినిమా సైరా, ఎన్టీఆర్-త్రివిక్రమ్, రవితేజ-శ్రీనువైట్ల సినిమాల్లో మాంచి పాత్రలు రానుండడంతో సునీల్ హ్యాపీగా వున్నాడట.
ఇదిలా వుంటే శివలెంక కృష్ణప్రసాద్ పక్కన పెట్టిన చతురంగ వేట్టై రీమేక్ ప్రాజెక్టును నిర్మాత ఎఎమ్ రత్నం టేకప్ చేసే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. ఆద్యంతం కాస్త సీరియస్ నోట్ తో సాగే ఆ సినిమాను గోపీచంద్ లేదా, సందీప్ కిషన్ లతో చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.