తెలుగులో చాలా రకాల హిట్ సినిమాలు అయితే వస్తున్నాయి కానీ.. ఈ తరహా యాక్షన్ థ్రిలర్లు ఈ మధ్య కాలంలో రాలేదు.. అనే కితాబు వినిపిస్తోంది ‘పీఎస్వీ గరుడవేగ’కు. ఈ సినిమా విడుదలకు ముందు దీనిపై ఎవరికీ పెద్దగా నమ్మకం లేదని వేరే చెప్పనక్కర్లేదు. ప్రత్యేకించి ఇండస్ట్రీలోని వ్యాపార వర్గాలకు. రాజశేఖర్ కు చాలా సంవత్సరాలుగా సరైన హిట్టు లేకపోవడం అందుకు ఒక కారణం అయితే.. రాజశేఖర్ ఎంచుకొంటూ వస్తున్న సినిమాలు మరీ నాసికరకంగా ఉంటూ వస్తుండటం మరో కారణం.
అలాంటి పరంపరలోనే ఇదీ ఒకటి అని వ్యాపార వర్గాలు భావించాయి. ప్రీ రిలీజ్ మార్కెట్ లో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను కూడా ఎవరూ ముందుకు రానటువంటి పరిస్థితి! ఇదీ రాజశేఖర్ సినిమాను తక్కువ అంచనా వేయడంలో ఒక ప్రధానమైన రుజువు. అయితే కనీసం దర్శకుడి మీదనైనా కొంచెం విశ్వాసం ఉంచాల్సింది.
అతడు రెండుకోట్ల బడ్జెట్ తో రూపొందించిన గుంటూరు టాకీస్ పదికోట్ల రూపాయల పై స్థాయి మొత్తాన్ని వసూలు చేసిందన్న విషయాన్ని గుర్తించి ఉంటే.. ప్రీ రిలీజ్ మార్కెట్ లో ఈ సినిమాను కొనడానికి చాలా మందే ముందుకు వచ్చేవాళ్లు. అయితే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇలాంటి నేపథ్యంలో తీరా ఈ సినిమా హిట్ అనిపించుకున్న నేపథ్యంలో శాటిలైట్ రైట్స్ విషయంలో గిరాకీ ఏర్పడినట్టుగా తెలుస్తోంది.
పాజిటివ్ టాక్.. థ్రిల్లర్.. కాబట్టి.. దీని ప్రసార హక్కులు కొనడానికి చానళ్ల మధ్య పోటీ ఏర్పడినట్టుగా సమాచారం. ఇదీ రాజశేఖర్ అండ్ కంపెనీకి ఒకింత మేలే అని చెప్పాలి. ప్రీ రిలీజ్ మార్కెట్ లో అయితే ఏ కోటికో అరకోటికో ఈ సినిమా ప్రసార హక్కులను లాగేసే వాళ్లు. ఇప్పుడు హిట్ కాబట్టి.. శాటిలైట్ రైట్స్ భారీ ధరే పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి.