బాలకృష్ణ, నాగార్జున మధ్య బహిరంగ విబేధాలు లేకపోయినప్పటికీ ఇద్దరి మధ్య సఖ్యత లేదనేది సినీ జగమెరిగిన సత్యం. బాలయ్య ఇంటి వేడుకల్లో అక్కినేని కుటుంబం లేకపోవడం, అలాగే నాగార్జున తరఫు వేడుకలకి బాలయ్య గైర్హాజరు అవడం చాలా కాలంగా జరుగుతోంది. ఇద్దరి మధ్య కోల్డ్ వార్కి రీజన్ ఏంటనేది తెలియకపోయినప్పటికీ ఈ సీనియర్ల మధ్య స్నేహబంధాలైతే లేవని తేలిపోయింది.
ఈ నేపథ్యంలో రామ్‌గోపాల్‌వర్మతో నాగార్జున ఇప్పుడు సినిమా చేయడం చర్చనీయాంశమయింది. రామ్‌గోపాల్‌వర్మ డైరెక్షన్లో బాలకృష్ణ తన చిరకాల స్వప్నమైన ఎన్టీఆర్ బయోపిక్ తీద్దామని భావించాడు. అయితే బాలయ్య మాట వెనక్కి తీసుకుని తేజకి ఆ బాధ్యతలు అప్పగించడంతో వర్మ ఈగో హర్ట్ అయింది. ఇప్పుడు ఎన్టీఆర్ జీవితంలోని మరో కోణాన్ని చూపిస్తానంటూ తనో సినిమా అనౌన్స్ చేసాడు.
సరిగ్గా ఈ టైమ్‌లో వర్మతో నాగార్జున సినిమా పట్టాలెక్కుతోంది. ఈమధ్య ఆచితూచి సినిమాలు చేస్తోన్న నాగ్ ఇప్పుడు సడన్‌గా వర్మకి ఎందుకు అవకాశమిచ్చినట్టు? బాలయ్యతో వర్మకి బహిరంగ విబేధాలు స్పష్టమైన తరుణంలో నాగార్జున ఈ నిర్ణయం తీసుకోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆసక్తికరమైంది.
ఈమధ్య ఊరు పేరు లేని వాళ్లతో సినిమాలు చేస్తోన్న వర్మకి మళ్లీ నాగార్జున డేట్లు ఇవ్వడంతో అతని సినిమాకీ ఒక విధమైన గౌరవం వచ్చింది. మరి ఈ ప్రాజెక్టుకి బాలయ్య ఎంత వరకు ప్రేరకమయ్యాడనేది తెలీదు కానీ ఈ కోణం అయితే చర్చకి వస్తోంది.