వాట్సాప్: అందుబాటులోకి మరో ఫీచర్

వాట్సాప్ లో ఒక మెసేజ్ పెడితే ఇక దానిపై మన నియంత్రణ ఉండదు. ఏదైనా ఒక గ్రూప్ లో ఒక మెసేజ్ పోస్ట్ అయితే అది అందరికీ చేరిపోతుంది. పోస్ట్ పెట్టిన వ్యక్తి దాన్ని…

వాట్సాప్ లో ఒక మెసేజ్ పెడితే ఇక దానిపై మన నియంత్రణ ఉండదు. ఏదైనా ఒక గ్రూప్ లో ఒక మెసేజ్ పోస్ట్ అయితే అది అందరికీ చేరిపోతుంది. పోస్ట్ పెట్టిన వ్యక్తి దాన్ని డిలీట్ చేయడం సాధ్యం కాదు. దీంతో రాంగ్ మెసేజ్ పెట్టినప్పుడల్లా సారీ చెబుతూ మరో మెసేజ్ పెట్టడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు దీనిపై ఓ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది వాట్సాప్. ఓ మెసేజ్ పోస్ట్ అయిన తర్వాత కూడా నచ్చకపోతే డిలీట్ చేసే సౌకర్యం వచ్చింది.

అవును.. ఏదైనా గ్రూప్ లో పోస్ట్ పెట్టిన తర్వాత అది మీకు నచ్చకపోయినా, ఎవరైనా అభ్యంతరం వ్యక్తంచేసినా వెంటనే దాన్ని డిలీట్ చేసే సౌకర్యాన్ని వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. డిలీట్ చేయాలనుకున్న మెసేజ్ పై ట్యాప్ చేస్తే చాలు ఆప్షన్ వస్తుంది. అలా డిలీట్ చేస్తే మీరు పోస్ట్ చేసిన గ్రూప్ నుంచి మెసేజ్ తొలిగిపోతుంది. ఆ స్థానంలో “ఈ మెసేజ్ తొలిగింపబడింది” అనే సందేశం మాత్రమే వస్తుందన్నమాట.

అయితే ఇందులో కూడా కొన్ని ఇబ్బందులున్నాయి. మీరు ఏదైనా మెసేజ్ ను డిలీట్ చేయాలనుకుంటే ఆ పనిని పోస్ట్ చేసిన 7 నిమిషాల్లోనే చేయాలి. 7 నిమిషాల తర్వాత సదరు మెసేజీని పర్మనెంట్ పోస్ట్ గా భావిస్తుంది వాట్సాప్. మరో ఇబ్బంది ఏంటంటే.. మీతో పాటు అవతలి వ్యక్తి కూడా లేటెస్ట్ వాట్సాప్ వెర్షన్ కలిగి ఉండాలి. లేదంటే పోస్ట్ డిలీట్ కాదు. ఇక గ్రూపుల్లో ఇలాంటి పోస్టులు డిలీట్ చేయాలంటే ఎంత కష్టమో ఆలోచించుకోండి. 

మొత్తమ్మీద వాట్సాప్ వినియోగదారులకు ఉన్నంతలో ఇది మంచి సదుపాయమనే చెప్పాలి. ఇకపై ఒకరికి పంపించాల్సిన మెసేజ్ మరొకరికి పంపించినా టెన్షన్ పడాల్సిన పనిలేదు. 7 నిమిషాల్లోపు మీరే డిలీట్ చేసేయొచ్చు.