మహేష్‌తో వరుసగా మూడు సినిమాలు తీసిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థని తన మాతృ సంస్థగా సూపర్‌స్టార్ పేర్కొన్నాడు. దూకుడుతో ఘనంగా ఎంట్రీ ఇచ్చిన 14 రీల్స్‌కి ఆ తర్వాత లెజెండ్ మినహా ఏదీ కలిసి రాలేదు. మహేష్‌తో తీసిన 1 నేనొక్కడినే, ఆగడు చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి.
భారీ పరాజయాలతో స్టార్ హీరోలని వదిలేసి మీడియం రేంజ్ సినిమాలు మొదలు పెట్టారు. కృష్ణగాడి వీర ప్రేమగాధ యావరేజ్‌గా ఆడగా, లై చిత్రంతో మరోసారి ఈ సంస్థకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పెట్టిన ఖర్చులో సగం కూడా వెనక్కి రాకపోవడంతో 14 రీల్స్ కష్టాల్లో పడింది. దీంతో మరోసారి మహేష్‌నే నమ్ముకోవాలని చూస్తున్నారు.
ఆగడు తర్వాత మరో చిత్రం చేస్తానని మాట ఇచ్చిన మహేష్ త్వరలోనే ఈ సంస్థలో ఇంకో చిత్రం చేస్తానని చెప్పాడట. ప్రస్తుతం ఆ చిత్రం కోసమని దర్శకుల అన్వేషణలో పడ్డారు. క్రేజీ కాంబినేషన్ సెట్ చేసుకోవడం కంటే యువ దర్శకుల వద్ద మంచి కథలు వున్నాయేమోనని చూస్తున్నారట. ఈ చిత్రానికి మహేష్ పారితోషికం వద్దన్నాడని, లాభాల్లో వాటా తీసుకుంటాడని సమాచారం.