ఎవరు ఎన్ని సుద్దులు చెప్పినా, పైకి కులాలు లేవు, కులాల గోడలు కూల్చండి అని నినాదాలు పైకి ఇచ్చినా, లోలోపల తెలుగు రాష్ట్రంలో కులాల కుంపట్లు భయంకరంగా రాజుకున్నాయి. అన్ని లెక్కలు వాటి చుట్టూనే తిరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మీడియా టైకూన్ రామోజీ రావుకు కింగ్ పిన్ గా, తెలుగుదేశం పార్టీలో, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పగలిగిన వ్యక్తిగా వుంటూ వచ్చారు. కానీ గడచిన మూడేళ్లుగా సీన్ కొంత మారింది.
రామోజీ ప్లేస్ లోకి వచ్చే ప్రయత్నాన్ని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేపట్టినట్లు కనిపించింది. పైగా రామోజీ మాదిరిగా కాకుండా, రాధాకృష్ణ దాదాపు ఆంధ్ర రాజకీయ నాయకులతో నేరుగా సంబంధ బాంధవ్యాలు కలిగి వున్నట్లు, సాన్నిహిత్యం పెంచుకుంటున్నట్లు తరచూ గ్యాసిప్ లు వినిపించాయి. ఆయన కాలమ్ లో కూడా ఈ సంగతి కాస్త బయటపడుతూ వస్తోంది.
ఇలాంటి నేపథ్యంలో వైకాపా అధినేత ఈనాడు రామోజీతో సమావేశం అయ్యారు. ఈనాడు కూడా గడచిన కొంత కాలంగా జగన్ పట్ల కాస్త అంటే కాస్త సానుకూల ధోరణికి వచ్చినట్లు కనిపిస్తోంది. జగన్ ను గాల్లోకి ఎత్తకపోయినా, వ్యతిరేకించడం తగ్గింది. అలాగే జగన్ కు కవరేజీ సింగిల్ కాలమ్ సైజు నుంచి పెరిగింది.
దీంతో పైకి చెప్పకపోయినా, చాలామంది కమ్మ సామాజిక వర్గ జనాలకు ఈ పరిణామం అంతగా నచ్చలేదు. అయితే రామోజీరావు లాంటి వ్యక్తిని తప్పు పట్టిగలిగినంత సీన్ కమ్మ సామాజిక వర్గ జనాలకు లేదు. అందుకని వాళ్లలో వాళ్ల డిస్కషన్లకే ఈ విషయం పరిమితం అయిపోయింది.
రామోజీ లాంటి వారే కాస్త తగ్గారు, జగన్ కు అభయం ఇచ్చారు. కానీ రాధాకృష్ణ ఇంకా మొండిగానే వున్నారు. జగన్ కూడా ఆయనను ప్రసన్నం చేసుకునే పని పెట్టుకోలేదు. అందువల్ల ఇక తెలుగుదేశం జనాలకు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గ జనాలకు రాధాకృష్ణ హీరోనే. 'ఆడు మగాడ్రా బుజ్జీ' అనుకోవడం పక్కా.