టాలీవుడ్ లో ఓ కనపడని సంప్రదాయం వుంది. ఎవరైనా పెద్ద హీరో సినిమాకు డేట్ ప్రకటిస్తే, మరో హీరో ఆ డేట్ కు కాస్త అటు ఇటుగా వుంటారు. లేదూ అంటే, తనకు కూడా అప్పుడే రావాలని వుందని సదరు హీరో యూనిట్ కు చెబుతారు. ఇద్దరు కలిసి ఓ అండర్ స్టాండింగ్ కు రావడం కామన్. కానీ రాను రాను ఈ సంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చేస్తున్నట్లు కనిపిస్తోంది.
లాస్ట్ ఇయర్ బన్నీ సరైనోడు వుండగా, పవన్ సైలంట్ గా డేట్ అనౌన్స్ చేసారు. దాంతో బన్నీ మార్చుకున్నారు. ఈసారి కూడా చరణ్ సంక్రాంతికి డేట్ అనుకుంటే, మళ్లీ పవన్ నే టక్కున డేట్ చెప్పేసారు. చరణ్ వెనక్కు వెళ్లారు. అప్పటికే బన్నీ నా పేరు సూర్య డేట్ ఏప్రిల్ 27 అని చెప్పడంతో చరణ్ మార్చి ఆఖరు వారం కానీ, ఏప్రియల్ ఫస్ట్ వీక్ కానీ ఫిక్స్ చేసుకుంటారు. అయితే ఇదంతా ఓ ఫ్యామిలీలో వ్యవహారం.
కానీ ఇప్పుడు మహేష్ వున్నట్లుంది ఏప్రిల్ 27న తన సినిమా డేట్ ప్రకటించేసారు. ఆ డేట్ కు వస్తామని ముందుగా బన్నీ చెప్పనే చెప్పాడు. దీంతో ఈ వ్యవహారంపై బన్నీ క్యాంప్ కాస్త ఆగ్రహంతో వున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా తాము అనుకున్న డేట్ కు ఏప్రిల్ 27న రావాల్సిందే అని బన్నీ మద్దతు దారులు పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్ని సినిమాలు వున్నా కంటెంట్ వున్న సినిమానే ఆడుతుందని, మొన్నటి మొన్న స్పైడర్ సినిమాపై మహానుభావుడు లాంటి మీడియం సినిమా వచ్చి, నిలిచి గెలిచిందని గుర్తు చేస్తున్నారు.
అందువల్ల వెనక్కు తగ్గకుండా మహేష్ సినిమా మీద అని కాకుండా, అనుకున్న డేట్ కు 27 ఏప్రిల్ నే నా పేరు సూర్య సినిమావిడుదల చేయాలని బన్నీపై వత్తిడి వస్తున్నట్లు వినికిడి.