రాజకీయంగా సెటైర్లు.. ఇండస్ట్రీలో మాత్రం స్నేహితులు

ఒకే వేదికపై రజనీకాంత్, కమల్ హాసన్ కనిపిస్తే చూడ్డానికి బాగుంటుంది. కానీ అది పెద్ద సంచలనం మాత్రంకాదు. గతంలో వీళ్లిద్దరూ వేదిక పంచుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకే స్టేజ్…

ఒకే వేదికపై రజనీకాంత్, కమల్ హాసన్ కనిపిస్తే చూడ్డానికి బాగుంటుంది. కానీ అది పెద్ద సంచలనం మాత్రంకాదు. గతంలో వీళ్లిద్దరూ వేదిక పంచుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకే స్టేజ్ పైకి ఈ ఇద్దరూ వస్తున్నారంటే మాత్రం కచ్చితంగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే కమల్ రాజకీయాల్లోకి వస్తున్నాడు. అతడిపై రజనీకాంత్ సెటైర్లు వేస్తున్నాడు.

“రాజకీయాల్లో నెగ్గుకు రావాలంటే సినిమాలు, పేరుప్రతిష్టలు ఉంటే సరిపోవు. ఇంకేదో కావాలి. అదేంటో ప్రజలకు బాగా తెలుసు” అంటూ పబ్లిక్ గానే కమల్ పై సెటైర్లు వేశాడు రజనీకాంత్. ఆ తర్వాత కమల్ కూడా దానికి కౌంటర్ ఇచ్చాడు. అవసరమైతే సీఎం పదవికి పోటీ చేస్తానని కూడా ప్రకటించాడు. ఇలా రాజకీయంగా ఇద్దరి మధ్య అగ్గిరాజుకుంటున్న టైమ్ లో రజనీకాంత్ సినిమా ఫంక్షన్ కు కమల్ రానుండడం ఆసక్తికరంగా మారింది.

దుబాయ్ లో ఈనెల 27న జరగనున్న 2.0 సినిమా ఆడియో ఫంక్షన్ కు కమల్ హాసన్ ప్రత్యేక అతిధిగా హాజరుకానున్నాడు. ఒకే వేదికపై కమల్, రజనీకాంత్ కలిసి తమ సినీ అనుభవాల్ని పంచుకోబోతున్నారు. ఇది సాధ్యమేనా అనేది కొందరి డౌట్.

త్వరలోనే శంకర్ దర్శకత్వంలో భారతీయుడు-2 చేయబోతున్నాడు కమల్ హాసన్. అతడి కోరిక మేరకే 2.0 ఆడియోకు రావడానికి ఒప్పుకున్నాడట కమల్. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని.. తమకు, రజనీకి మధ్య సైద్ధాంతిక విభేదాలే తప్ప వ్యక్తిగత విభేదాలు లేవని గతంలో ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ చెప్పుకొచ్చాడు. సో.. 2.0 ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు కమల్ రావడం దాదాపు ఖాయం.