దేశం కోసం సైనికులు ప్రాణ త్యాగం చేయడం కొత్తేమీ కాదు. దురదృష్టవశాత్తూ ఆ సైనికుల త్యాగాలకు పాలకులు తగిన 'గౌరవం' ఇవ్వడంలేదనే చెప్పాలి. అధికారంలో ఎవరున్నా చేసేది అదే. జమ్మూకాశ్మీర్లో పీడీపీ – బీజేపీ కూటమి అధికారం చెలాయిస్తోందిప్పుడు. అయినా, అక్కడి అధికార పార్టీ పీడీపీ, పలు సందర్భాల్లో వేర్పాటువాద సంస్థలకు మద్దతిస్తోంటే, బీజేపీ చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది. పీడీపీ విజయోత్సవాల్లో వేర్పాటువాదులు తుపాకీల్ని ప్రదర్శించడం, పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేయడాన్ని ఎలా మర్చిపోగలం.?
ఇక, అసలు విషయానికొస్తే గడచిన మూడున్నరేళ్ళలో జమ్మూకాశ్మీర్ మరింతగా రగిలిపోతోంది. తుపాకీ కాల్పుల మోతతో దద్దరిల్లిపోతోంది. ఆందోళనలతో అట్టుడికిపోతోంది. ఓ వైపు పొరుగుదేశం పెంచి పోషిస్తోన్న తీవ్రవాదులు, ఇంకో వైపు జమ్మూకాశ్మీర్లో అంతర్గతంగా పుట్టుకొస్తోన్న వేర్పాటువాదులు.. వెరసి పరిస్థితి రోజురోజుకీ మరింత దారుణంగా తయారవుతూ వస్తోంది.
'ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు.. వేర్పాటువాదులతో చర్చలకు అవకాశమే లేదు..' అంటూ గతంలో మోడీ సర్కార్, ఘాటైన సంకేతాలు పంపింది. ఈ క్రమంలోనే చాలామంది సైనికులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు చావుకబురు చల్లగా చెబుతోంది కేంద్రం. కొత్త వ్యూహమంటూ 'చర్చలకు' తెరలేపింది. చర్చల ద్వారా ఏ సమస్యకైనా పరిష్కారం లభించొచ్చుగాక, కానీ జమ్మూకాశ్మీర్ విషయంలో చర్చలంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటి వుండదు.
జమ్మూకాశ్మీర్ యువతలో అక్కడి పాలకులు, పార్టీలు 'వేర్పాటువాదాన్ని' పెంచి పోషించాయన్నది ఓపెన్ సీక్రెట్. దానికి తోడు పొరుగుదేశం పాకిస్తాన్ అక్కడ సృష్టించే అల్లర్లు, వాటి కోసం వెచ్చించే సొమ్ములు.. ఇదంతా జగమెరిగిన సత్యం. ఈ పరిస్థితుల్లో చర్చలంటే ఎవరితో జరపాలి.? వేర్పాటువాదులైతే అసలు చర్చల ప్రసక్తే లేదంటున్నారు. పీడీపీ మాత్రం చర్చల ప్రక్రియ ఆహ్వానించదగ్గదని చెబుతోంది.
పెద్ద పాత నోట్ల రద్దుతో కాశ్మీర్లో పరిస్థితి మారిపోయింది.. ఇప్పుడంతా హ్యాపీ.. అని కేంద్రం మొన్నామధ్యన ప్రకటించుకుంది. తీవ్రవాదుల ఆర్థిక మూలాల్ని దెబ్బకొట్టామని చెప్పుకుంది. కానీ, ఇప్పుడీ చర్చల ప్రక్రియ పేరుతో వేర్పాటువాదులకు, తీవ్రవాదులకు కేంద్రం సరెండర్ అయిపోయిందనుకోవాలా.? అదే నిజమైతే, పోయిన సైనికుల ప్రాణాలకు లెక్క చెప్పేదెవరు.? మోడీజీ, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి తీరాల్సిందే.