జియో ఉందని పొంగిపోకండి

జియో 4జీ హ్యాండ్ సెట్ల పంపిణీ దాదాపు కొలిక్కి వచ్చింది. మరో 4రోజుల్లో మొదటి విడత 60లక్షల హ్యాండ్ సెట్లు అందించే ప్రక్రియ పూర్తికానుంది. మరోవైపు పండగ కానుకగా పలు రీచార్జ్ లు ప్రకటించింది…

జియో 4జీ హ్యాండ్ సెట్ల పంపిణీ దాదాపు కొలిక్కి వచ్చింది. మరో 4రోజుల్లో మొదటి విడత 60లక్షల హ్యాండ్ సెట్లు అందించే ప్రక్రియ పూర్తికానుంది. మరోవైపు పండగ కానుకగా పలు రీచార్జ్ లు ప్రకటించింది జియో. ఎన్నో క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఎనౌన్స్ చేసింది. అయితే ఇవన్నీ చూసి పొంగిపోవద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇవన్నీ వాత పెట్టడానికి ముందు వెన్నపూసే రకమని, రానున్న రోజుల్లో జియో నుంచి రీచార్జ్ ల మోత తప్పదని అంటున్నారు. అది కూడా కస్టమర్ కు నొప్పి తెలియని విధంగా వాత పడుతుందని చెబుతున్నారు.

గడిచిన వారమే జియో తన రీచార్జ్ ల మొత్తాన్ని 15శాతం పెంచింది. 2018 చివరినాటికి రీచార్జ్ రేట్లను మరింత పెంచబోతోంది. ఈ విషయంలో నొప్పి తెలియకుండా డబ్బు గుంజాలని నిర్ణయించింది. ఉదాహరణకు 309 ప్లాన్ నే తీసుకుంటే ఈ రీచార్చ్ రేటును పెంచడం లేదు. కానీ 49 రోజుల వాలిడిటీని 28 రోజులకు తగ్గించే ప్రక్రియ మొదలైంది. ఇలా అన్ని రీచార్జీల్ని 2018 నాటికి సవరించబోతోంది జియో. 

జియోలో సూపర్ హిట్ అయిన 399రూపాయల రీచార్జ్ (3 నెలలకు)ను ఇప్పటికే 459 రూపాయలు చేశారు. త్వరలోనే 149, 509 ప్యాక్స్ లో కూడా మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇలా దాదాపు అన్ని ప్యాకేజీ రేట్లను సవరించి, 2018 చివరి నాటికి 18శాతం రేట్లు పెంచాలని జియో నిర్ణయించింది. కస్టమర్లంతా ఎంతో సంబరపడుతున్న అన్-లిమిటెడ్ టాక్ టైమ్ పై కూడా జియో కన్నేసింది.

ఇలా అంతా ఫ్రీ అని బుకాయించి కస్టమర్ కు అరచేతిలో స్వర్గం చూపించిన జియో.. ఇప్పుడిప్పుడే తన అసలు రూపాన్ని బయటపెడుతోంది. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న తక్కువ నాణ్యత కలిగిన 4జీ ఫోన్లతో కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న జియో, త్వరలోనే రీచార్జ్ ల రూపంలో మరింత మంది జేబులకు చిల్లులు పెట్టబోతోంది. 

తాజా పరిణామాలతో ఎయిర్ టెల్, ఐడియా లాంటి సంస్థలు మాత్రం సంబర పడుతున్నాయి. జియో భ్రమలు తొలిగిపోవడంతో ఇకపై తమ కస్టమర్లు తమకే ఉంటారని ఆశిస్తోంది. వచ్చే ఏడాది నాటికి టెలికం రంగంలో ధరల పరంగా ఓ స్థిరత్వం వస్తుందని అంచనా వేస్తున్నాయి.