చాలా పద్దతిగా, శాస్త్రోక్తంగా పవర్ స్టార్, జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆడ్మినిస్ట్రేటివ్ ఆఫీసును ప్రారంభించారు. నిజానికి ఇది కొత్త ఆఫీసు కాదు. పాతదే. స్వంతం కాదు అద్దెదే. అయినా అన్ని విధాలా విభాగాల వారీగా రోజువారీ కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా, గదులు ఏర్పాటు చేసి, రెండు ఫ్లోర్లతో సిద్దం చేసారు. దీంట్లోకి పవన్ కళ్యాణ్ గృహప్రవేశం చేసారు.
సాధారణంగా అద్దె ఇంట్లోకి వెళ్లే వాళ్లు గృహప్రవేశం చేయరు. మామూలుగా పాలు పొంగించి దిగిపోతారు. కొత్త ఇల్లు అయితే కట్టుకున్నవాళ్లు గృహప్రవేశం చేస్తారు. అయితే ఇక్కడ డైరక్షన్ అంతా త్రివిక్రమ్ ది. పైకి ఎన్ని చెప్పినా, బాబాల్నే నమ్ముతారు, మ్యాజిక్ లే కావాలని డైలాగులు రాసినా, త్రివిక్రమ్ కు ఈ నమ్మకాలు ఎక్కువ. ఆయనకు ఓ గురువుగారు వున్నారు. ఆయన మాట వేదవాక్కు. ఆ గురువుగారే ఇప్పుడు పవన్ కు గురువుగారు. తరుచు హోమాలు, యాగాలు సాగుతుంటాయి. ఒక్కో హోమం ఖర్చు లక్షల్లో వుంటుదని వినికిడి.
ఆ సంగతి అలా వుంచితే, కొత్త అద్దె ఆఫీసులోకి పవన్ గృహప్రవేశం తరహాలో ప్రవేశించారు. ఇంటి ముందు కూష్మాండబలి ఇచ్చారు. దేవుడి విగ్రహంతో లోపలికి ప్రవేశించారు. ఈ మూషిక గణపతి విగ్రహాన్ని త్రివిక్రమ్ స్వయంగా సంచిలో పెట్టుకుని తెచ్చి ఇచ్చారు. భారతమాత పూజతో అని చెప్పినా, నిజానికి భరత మాత ఫోటొ పట్టుకుని లోపలకు వెళ్లలేదు. గణపతి విగ్రహతోనే వెళ్లారు. గణపతి విగ్రహం పెట్టే పూజ చేసారు. పద్దతిగా తన సీట్లో కూర్చుని వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు.
మరి ఈ సందర్భంగా ఏమైనా హోమాలు జరిపారా? అన్నది తెలీదు. త్రివిక్రమ్, పవన్ ల తరపున హోమాలు తరచు జరిపే గురువుగారు ఇప్పుడు జరిపే వుంటారు. అన్నీ బాగానే వున్నాయి. కానీ ఇలా ఇంట్లో గృహప్రవేశం, పూజ లాంటి కార్యక్రమాలు ఎవరైనా సరే, సతీ సమేతంగా చేస్తారు. అలా చేయడం పద్దతి. చేయడం మంచిది.
కానీ పవన్ ఒంటరిగా చేసారేలనో? పవన్ భార్య క్రిస్టియన్ అయినందునా? నాగ్ భార్య అమల ఆంగ్లో ఇండియన్ అయినా, నాగ్ తో కలిసి అన్ని ఫంక్షన్లకు, ఆలయాలకు హాజరవుతారు. పోనీ పూజలు అవీ చేయకపోయినా, పవన్ తన భార్యను పక్కన వుంచుకుని గృహప్రవేశం చేస్తే బాగుండేదేమో? సతీసమేతంగా గృహప్రవేశం చేస్తే బాగుంటుందని పవన్ కు ఆయన మెంటార్ లాంటి త్రివిక్రమ్ సూచించలేదేమో?