భాగమతి బయటకు వస్తోంది

యువి క్రియేషన్స్ నిర్మించిన భారీ సినిమా భాగమతి. బాహుబలి సినిమా సెట్స్ మీద వుండగానే ఇదీ మొదలైంది. కానీ ఇప్పటికి ఇంకా తీరుబాటు చిక్కడం లేదు థియేటర్లలోకి రావడానికి. సుమారు ముపై అయిదు కోట్ల…

యువి క్రియేషన్స్ నిర్మించిన భారీ సినిమా భాగమతి. బాహుబలి సినిమా సెట్స్ మీద వుండగానే ఇదీ మొదలైంది. కానీ ఇప్పటికి ఇంకా తీరుబాటు చిక్కడం లేదు థియేటర్లలోకి రావడానికి. సుమారు ముపై అయిదు కోట్ల ఖర్చుతో నిర్మించిన భారీ సినిమా. గ్రాఫిక్స్ కోసం కిందా మీదా అయ్యారు. బాగా చేయించుకున్నారు. భారీ సెట్ లు వేసారు. అనుష్క హీరోయిన్ కావడంతో, మరింత జాగ్రత్తలు తీసుకున్నారు.

కానీ సినిమా విడుదల మాత్రం కనిపించలేదు. ఈ మధ్యనే ఇదే సంస్థ నిర్మించిన మహానుభావుడు సినిమా విడుదలై, మంచి విజయం నమోదు చేసింది. మరోపక్క ఇదే సంస్థ బాహుబలి ప్రభాస్ తో సాహో సినిమా భారీగా నిర్మిస్తోంది. మరి ఇంతకీ ఈ బాగమతి మాటేమిటి?

సినిమా అంతా రెడీగా వుందట. విడుదల ఆలస్యం అంట. కొద్దిగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు బకాయి వుంటే, ఇప్పుడు వాటిని యుద్ధ ప్రాతిపదికన ఫినిష్ చేసే పని స్టార్ట్ చేసారట. డిసెంబర్ లో ఎక్కడ స్లాట్ దొరికితే అక్కడ భాగమతిని వదలాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే డిసెంబర్ ఫస్ట్ అండ్ లాస్ట్ వీక్ ల్లో కాస్త చెప్పుకోతదగ్గ సినిమాలే వున్నాయి. అందువల్ల రెండు మూడో వారాల్లో భాగమతిని వదిలే అవకాశం వుందనుకోవాలి.

సోషియో ఫాంటసీ థ్రిల్లర్ సబ్జెక్ట్ తో రూపొందించిన భాగమతికి అశోక్ దర్శకుడు. ఆయన గతంలో పిల్ల జమీందార్ సినిమాకు దర్శకత్వం వహించారు.