జనసేనాని రాజకీయ పంథా సినిమాను తలపిస్తుంటుంది. శ్రీకాళహస్తిలో తన పార్టీ కార్యకర్త సాయిపై సీఐ అంజూయాదవ్ దాడి చేయడాన్ని పవన్‌కల్యాణ్ సీరియస్‌గా తీసుకున్నారు. తానే తిరుపతి వెళ్లి సీఐ అంతు చూస్తానని ఆయన హెచ్చరించారు. దీంతో పవన్‌కల్యాణ్ తిరుపతి పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. తిరుపతిలో పవన్ అడుగు పెడితే ఏమవుతుందోననే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.
ఇవాళ ఆయన తిరుపతికి వెళ్లారు, తిరిగి అక్కడి నుంచి వెనుతిరగడం కూడా జరిగిపోయింది. పవన్ తిరుపతి పర్యటనపై నెటిజన్లు సెటైర్స్ పేలుస్తున్నారు. పబ్లిసిటీ ఫుల్, రియాల్టీ నిల్ అని వెటకరిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి ఇవాళ ఉదయం పవన్‌కల్యాణ్ చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతి ఎస్పీ కార్యాలయానికి 16 కి.మీ వుంటుంది. అక్కడికి ఊరేగింపుగా పవన్ వెళ్లారు. దీనికి 1.30 గంట సమయం పట్టింది.
తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డిని పవన్‌కల్యాణ్ కలిశారు. శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌పై చర్య తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. మరోవైపు ఎస్పీ కార్యాలయం నుంచి వెలుపలికి రాగానే మీడియాతో మాట్లాడ్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎస్పీతో 25 నిమిషాల పాటు జనసేన నేతలు భేటీ అయ్యారు. అనంతరం ఎస్పీ కార్యాలయం నుంచి పవన్‌తో పాటు జనసేన నేతలు బయటికి వచ్చారు.
తన కోసం ఏర్పాటు చేసిన వాహనంలో తిరిగి పవన్ బయల్దేరారు. బహుశా ఆయన విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడినట్టు తెలుస్తోంది. తాము పద్ధతి ప్రకారం వుంటామని, పోలీసులు కూడా క్రమశిక్షణతో మెలగాలని పవన్ సూచించారు. మరోసారి శ్రీకాళహస్తిలో తమ కార్యకర్తపై దాడిలాంటివి పునరావృతం కాకుండా చూడాలని విన్నవించారు.
ఇదిలా వుండగా ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళుతూ, పనిలో పనిగా కొంత సమయాన్ని తిరుపతి వెళ్లేందుకు కేటాయించినట్టు ప్రచారం జరుగుతోంది. అంతే తప్ప, అదే పనిగా తిరుపతి కార్యక్రమాన్ని పవన్ పెట్టుకోలేదని సమాచారం. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ తప్ప మరొకటి కాదని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.