జనసేనాని పవన్‌కల్యాణ్‌కు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి చురకలు అంటించారు. శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డికి వినతిపత్రం ఇచ్చేందుకు పవన్ అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన జనసేనాని తీరుపై ఆగ్రహం ప్రదర్శించారు. పవన్‌కల్యాణ్ ఒంటెత్తు పోకడలపై మండిపడ్డారు.
పవన్ రాకను ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో దాడి చేయడంగా భూమన అభివర్ణించారు. వినతిపత్రం ఇవ్వడానికి ఇలా మందీమార్బలం, హంగూ ఆర్భాటాలతో రారని హితవు చెప్పారు. పవన్‌కల్యాణ్ తన అభిప్రాయాల్ని వ్యక్తీకరించడానికి చక్కటి వేదికలు ఉన్నాయన్నారు. ఆ వేదికలు వాడుకోకుండా, ఊరి మీద దాడి చేస్తున్నట్టుగా ఆయన ప్రవర్తించడం అభ్యంతరకరమ న్నారు. రాజకీయాల కోసం తనకు కావాల్సిన వాళ్లను సమర్థించుకోవడంలో తప్పు లేదని, ఆ నెపంతో ప్రజలందరిపై దాడి చేస్తున్నట్టుగా ప్రవర్తించడం తీవ్ర అభ్యంతరకరమన్నారు.
తనకు ఓట్లు వేసేవాళ్లకు ఏం చేస్తారో చెప్పకుండా, కారణం లేని పగ, కారణం లేని ప్రతీకారపు మాటలు నిత్యం పవన్ నుంచి వస్తున్నాయని విమర్శించారు. ప్రతిరోజూ భీషణ ప్రతిజ్ఞలు, వైసీపీపై విపరీతమైన నిందలు వేస్తున్నారని పవన్‌పై విరుచుకుపడ్డారు.
పవన్‌కు ఒక ఫిలాసఫీ లేదన్నారు. నేను…నేను అని తప్ప, మేము అనే మాటే ఆయన దగ్గర లేదన్నారు. పార్టీ అంటే ఎప్పుడైనా మేము, మనం అని వుంటుందని భూమన చెప్పుకొచ్చారు. పవన్‌కల్యాణ్ ఇప్పటి వరకూ… నేను విప్లవకారుడిని, నా ఫిలాసఫీ ఇది, నేను ఇలాంటి వాడిని… ఈ మాటలు చెప్పడం తప్ప, మనం అని మాట్లాడలేకపోవడం ఆయన భావదారిద్ర్యానికి నిదర్శనమన్నారు. ఇవాళ తిరుపతి పట్టణంలో వీరంగం చేయడానికి తప్ప మరొకటి కాదని ఆయన విమర్శించారు.