టమాట రేటు చుక్కల్ని తాకుతున్న వేళ.. దానిచుట్టూ చిత్రవిచిత్రమైన కథనాలు కనిపిస్తున్నాయి. కొంతమంది టమాటాలకు ప్రైవేటు సెక్యూరిటీ పెట్టుకుంటే, మరో వ్యక్తి టమాటాలతో తులాభారం వేయించాడు. ఇంకో చోటు టమాట తోటలో దొంగతనం జరగ్గా, మరోచోటు టమామాలు అమ్మి కోటీశ్వరులవుతున్నారు కొంతమంది రైతులు.
టమాట తోటలో దొంగతనం
తాజాగా టమాట తోటలో దొంగతనం జరిగింది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నెక్కుంది గ్రామ సమీపంలో వేసిన ఓ టమాట తోటలో దొంగలు పడ్డారు. 50వేల రూపాయల విలువ చేసే టమాటాల్ని గంటల వ్యవథిలో తోట నుంచి తరలించారు. దీంతో రైతు ఉదయ్ కుమార్ లబోదిబోమంటున్నాడు. 450 కిలోల టమాటాలు చోరీ అయ్యాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
టమాటాలతో తులాభారం
అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయంలో ఓ భక్తుడు టమాటాలతో తులాభారం వేశాడు. అనకాపల్లికి చెందిన అప్పారావు, మోహిని దంపతులు, తమ కుమార్తె భవిష్యకు తులాభారం వేశారు. 51 కేజీల టమాటాలతో తులాభారం నిర్వహించారు. ప్రస్తుతం అనకాపల్లిలో కేజీ టమాట ధర 130 రూపాయలు పలుకుతోంది. టమాటాలతో తులాభారం నిర్వహించడం స్థానికుల్ని ఆకర్షించింది.
టమాటాలతో కోటీశ్వరుడైన మరో రైతు
టమాటాలు అమ్మి కోటీశ్వరుడైన ఓ మహారాష్ట్ర రైతు గురించి ఇప్పటికే తెలుసుకున్నాం. తాజాగా ఛత్తీస్ గడ్ కు చెందిన మరో రైతు టమాటాలు అమ్మి కోటీశ్వరుడయ్యాడు. థంతరీ జిల్లాలోని బీరన్ గ్రామానికి చెందిన అరుణ్ సాహు, తన 15 ఎకరాల్లో టమాట సాగుచేశాడు. రోజుకు 600 నుంచి 700 పెట్టెలు విక్రయించాడు. ఫలితంగా నెల రోజుల్లో కోటికి పైగా సంపాదించాడు.
టమాటాలకు పోలీసు బందోబస్తు
కర్నాటక నుంచి టమాటాల లోడుతో ఢిల్లీకి వెళ్తున్న లారీ ఆదిలాబాద్ జిల్లా, మావల సమీపంలో బోల్తాపడింది. ఈ లారీలో 638 డబ్బాల్లో 18 టన్నుల టమాటాలున్నాయి. వీటి ధర 22 లక్షల రూపాయల పైమాటే. ప్రస్తుతం టమాటాలకు ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. దీంతో ఈ టమాటాలు దొంగతనానికి గురికాకుండా, పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. మావల పోలీస్ స్టేషన్ నుంచి నలుగురు పోలీసులు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పెట్రోలింగ్ టీమ్ నుంచి మరో నలుగురు సిబ్బంది కలిసి ఈ టమాటాల్ని కాపలా కాశారు.
సబ్సిడీలో టమాట
టమాట ధరలు రోజురోజుకు పెరుగుతున్న వేళ, కేంద్రం ఇప్పటికే సబ్సిడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా సబ్సిడీని ఇంకాస్త పెంచింది. దీంతో నిన్నట్నుంచి కిలో టమాట 80 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది. వారణాసి, లక్నో, కాన్పూర్, పట్నా లాంటి సిటీల్లో కిలో టమాటను 80 రూపాయలకే విక్రయిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.