తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితకు ఒక బలహీనత వున్నట్టుంది. నిత్యం మీడియాలో కనిపించకపోతే తమ నాయకురాలికి నిద్ర పట్టదని టీడీపీ లీడర్స్ చెబుతుంటారు. పాయకరావుపేట నుంచి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్న అనితకు చంద్రబాబు టికెట్ ఖరారు చేశారో, లేదో తెలియడం లేదు. ఇటీవల పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ నేతలతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు.
అనితకు ప్రధానంగా టికెట్ బెంగ పట్టుకుంది. నిత్యం సీఎం వైఎస్ జగన్, ఆయన భార్య వైఎస్ భారతిపై నోరు పారేసుకుంటుంటే అయినా టీడీపీ పెద్దలు అనుగ్రహిస్తారని ఆమె అనుకుంటున్నట్టున్నారు. ఈ నేపథ్యంలో అనిత ఇవాళ ఏకంగా చేతికి చెప్పు తీసుకుని హెచ్చరించడం అందరి దృష్టిని ఆకర్షించారు. ఇదే ఆమె కోరుకుంటున్నది కూడా.
విజయవాడలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అనిత ఆగ్రహంతో ఊగిపోయారు. సోషల్ మీడియాలో మహిళలపై ఇకపై అసభ్యకర పోస్టులు పెడితే చూస్తూ ఊరుకునేది లేదని అనిత హెచ్చరించారు. ఈ సందర్భంగా అనితతో పాటు మహిళలు చేతికి చెప్పులు తీసుకుని హెచ్చరించారు. తనతో సహా పలువురు మహిళలపై పేటీమ్ బ్యాచ్, వైసీపీ నేతలు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని వాపోయారు.
అసభ్యకర పోస్టులు పెట్టిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన భార్య భారతి పైశాచిక ఆనందం పొందుతున్నారని అనిత విమర్శించారు. అనిత ఇలా సీఎం, ఆయన సతీమణిని పదేపదే టార్గెట్ చేస్తూ, అవాస్తవాలు మాట్లాడ్డం వల్లే ప్రత్యర్థులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్ దంపతులు వైసీపీ మహిళా నాయకురాళ్లపై అసభ్యకర పోస్టులు పెట్టారని ఎవరైనా ఆరోపిస్తే, ఎలా నమ్మశక్యం కాదో, సీఎం జగన్ దంపతులపై కూడా అదే కోణంలో అర్థం చేసుకోవాల్సి వుంటుంది. ముందుగా సీఎం జగన్, భారతిపై అనిత అవాకులు చెవాకులు మాట్లాడకుండా వుంటే, అసలు సమస్యే వుండదు.
తాను మాత్రం ఏమైనా మాట్లాడ్తానని, ఇతరులెవరూ తనను మంచిగా చూడాలంటే ఎలా అని అనితను ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. నిత్యం వైఎస్ భారతిపై పడి ఏడ్వడం తప్ప అనితకు మరో పనే లేకుండా పోయిందని వైసీపీ మహిళా నాయకురాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనతో ప్రత్యర్థులు ఎలాగైతే మర్యాదగా వుండాలని అనిత కోరుకుంటున్నారో, తాను కూడా అదే విధంగా వ్యవహరిస్తే గొడవే వుండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.