టాలీవుడ్ లో ఓ చిత్రమైన గ్యాసిప్ వినిపిస్తోంది. ఎంత వరకు నిజం అన్నది తెలియదు. విషయం ఏమిటంటే మైత్రీ సంస్థ నిర్మించాల్సిన ఉస్తాద్ సినిమాను మరో సంస్థకు బదలాయిస్తారన్నది ఆ గ్యాసిప్.
మైత్రీ నిర్మాతలు పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం జమానా కాలం నాడు భారీ అడ్వాన్స్ ఇచ్చారు. అది వడ్డీలు కలుపుకుంటే యాభై కోట్లు అయి వుంటుందని అనధికార అంచనా. ఇక ఈ సినిమా మీద ఇప్పటి వరకు పెట్టిన ఖర్చులు, అన్నీ కలిపి 60 కోట్లు దాటేసాయని తెలుస్తోంది.
ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే పవన్ ఈ సినిమా ఎప్పుడు చేస్తారో క్లారిటీ లేదు. ఎన్నికల తరువాత అంటే అప్పటి పరిస్థితులు ఎలా వుంటాయో తెలియదు. అధికారంలోకి వస్తే ఒకలా వుండొచ్చు. అధికారంలోకి రాకపోతే మరోలా వుండొచ్చు. మొత్తానికి అప్పటి పరిస్థితులు ఇప్పడు ఊహించేవి కావు. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్ ఇతరత్రా వ్యవహారాల మీద ఉస్తాద్ నిర్మాతలు హీరో తో డిస్కషన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ కు ఓ సినిమా చేసుకుని రావడానికి పవన్ అనుమతి ఇచ్చారని, ఆ మేరకు రవితేజతో రీమేక్ సెట్ అయిందని వార్తలు వచ్చేసాయి. ఇప్పుడు ఉస్తాద్ ప్రాజెక్ట్ నే ఏకంగా పీపుల్స్ మీడియా సంస్థ టేకోవర్ చేసేలా చర్చలు సాగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. డివివి దానయ్య-ప్రభాస్-మారుతి సినిమాను పీపుల్స్ మీడియా సంస్థ ఇలాగే టేకోవర్ చేసింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా టేకోవర్ చేస్తే ఆ సంస్థ పేరు వార్తల్లో బలంగా వినిపిస్తుంది.
బ్రో సినిమా తరువాత పీపుల్స్ మీడియా సంస్థ మీద అటు త్రివిక్రమ్ కు ఇటు పవన్ కు అభిమానం బాగా పెరిగిందని తెలుస్తోంది. పవన్ తో అదే సంస్థ కు మరో సినిమాను సెట్ చేయాలని అనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ కొత్త గ్యాసిప్ వినిపించడం ప్రారంభమైంది. రెండు ప్లస్ రెండు అంటే నాలుగు కావడం ఇదేనేమో?
ఒకవేళ ఇదే జరిగితే మైత్రీ సంస్త ఫుల్ హ్యాపీ అవుతుందేమో?