ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడికి తమ ఘనతను, గొప్పలను చాటుకోవాలని, తద్వారా ప్రజలను ఆకట్టుకోవాలనే కోరిక పెరిగిపోయింది. క్రమంగా ఇదో వేలంవెర్రిగా మారింది. పండుగలు, ఉత్సవాలు, జాతర్లు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుష్కరాలు మొదలైనవాటిని ప్రభుత్వాలే నిర్వహిస్తున్నాయి.
ఇందుకోసం కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తోంది. అన్ని మతాలవారు పన్నుల రూపంలో చెల్లించే డబ్బును విచ్చలవిడిగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఖర్చు చేస్తున్నారు. లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థలో పండుగలను, ఉత్సవాలను ప్రభుత్వమే స్వయంగా నిర్వహించడం, వాటి ప్రాశస్త్యం, అందుకు సంబంధించిన సెంటిమెంట్లను ప్రచారం చేయడం, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నాలు చేయడం ఎంతవరకు సమంజసం? అయినప్పటికీ అడిగేవారెవ్వరూ లేరు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని ద్రోహులుగా చిత్రీకరిస్తారు.
సాధారణంగా రాజకీయ పార్టీలు కూడా ప్రజల సెంటిమెంట్లతో ముడిపడిన కార్యక్రమాలకు ప్రజాధనం ఖర్చు చేస్తున్నా ఎక్కువగా మాట్లాడవు. ప్రజావ్యతిరేకత మూటగట్టుకోవల్సి వస్తుందనే భయం ఉంది. పండుగలు, ఉత్సవాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజలు, సంబంధిత సంస్థలు నిర్వహించుకున్నప్పుడు పాలకులు శాంతిభద్రతలు కాపాడేందుకు, ఆ కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు, కావల్సిన సౌకర్యాలు కల్పించేందుకు, ప్రమాదాలు జరగకుండా చూసేందుకు, రవాణా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటే చాలు.
కాని రాష్ట్ర విభజన తరువాత పాలకులు మొత్తం మీదేసుకొని చేస్తున్నారు. సంస్కృతీ సంప్రదాయాలను కాపాడటమనే ముసుగులో ఇది జరుగుతోంది. ఇక పండుగల సమయంలో పాలకులు వారి పేరుతో 'కానుక' అని చెప్పుకొని ఉచితంగా నిత్యావసర సరుకులు, వస్త్రాలు, ఇతర సహాయాలు అందిస్తున్నారు. కొన్ని మతాలవారు వారి పుణ్య క్షేత్రాలకు వెళ్లేందుకు ఆర్థిక సహాయం చేస్తున్నారు.
ప్రభుత్వాలు పంపిణీ చేసే నిత్యావసర సరుకులు, వస్త్రాలు నాసిరకంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈమధ్యనే బతుకమ్మ పండుగలకు తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పంపిణీ చేసిన చీరలపై ఎంత పెద్ద రగడ జరిగిందో చూశాం. గొప్పగా ప్రచారం చేసుకున్న చీరల పంపిణీ అభాసుపాలైంది. ముఖ్యమంత్రులిద్దరూ తామే పూజారుల్లా, ప్రవచనకారుల్లా, ప్రవక్తల్లా వ్యవహరిస్తున్నారు. భక్తి, ఆధ్యాత్మికం అనేవి వ్యక్తిగత ఆసక్తికి సంబంధించినవి. ఇష్టమైనవారు పండుగలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొంటారు. కాని ప్రతి దాన్నుంచి రాజకీయ ప్రయోజనాలు పొందాలని తెలుగు పాలకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే వారి ఇంట్లో కార్యక్రమంలా నిర్వహిస్తున్నారు.
గోదావరి, కృష్ణా పుష్కరాల్లో ఇద్దరు ముఖ్యమంత్రుల ఓవరాక్షన్ చూశాం. వీరిలో చంద్రబాబు నాయుడు రెండాకులు ఎక్కువ చదివారు. రాజమండ్రిలో తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోయినా కారకులెవరో చెప్పలేని పరిస్థితి. ఫలానా కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలని ఆహ్వానిస్తున్నారు. ప్రజలు తరతరాలుగా జరుపుకుంటున్న వివిధ పండుగల గురించి ఇప్పుడు పాలకులు చెప్పాల్సిన అవసరమేముంది? ఏ పండుగ ప్రాధాన్యం ఏమిటో వారికి తెలియదా? దేశంలో రవాణా సౌకర్యాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ, ప్రసార మాధ్యమాలు లేని రోజుల్లోనూ ప్రజలు పుష్కరాలు సహా అనేక పండుగలు సంప్రదాయబద్ధంగా, ఉత్సాహంగా జరుపుకున్నారు.
కాని ఇప్పటి పాలకులు ఆధ్యాత్మిక కార్యక్రమాలను విజయవంతం చేయండని ప్రజలకు పిలుపులిస్తున్నారు. విజయవంతం చేయాలని పిలుపునివ్వడమేమిటో అర్థం కావడంలేదు. ఉత్సవాలు ఘనంగా నిర్వహించి రాష్ట్రాల 'బ్రాండ్ ఇమేజ్' పెంచాలంటున్నారు. ఏపీలో ఈ ఏడాది దీపావళి పండుగను ప్రభుత్వమే ఘనంగా నిర్వహిస్తున్న చంద్రబాబు ప్రకటించారు. మీడియాలో ప్రకటనలు ఇచ్చారు. 'జబర్దస్త్'తో సహా వివిధ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఇక తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ దీపావళి తరువాత యాదవులు సంప్రదాయబద్ధంగా జరుపుకునే దున్నపోతుల ఉత్సవం (సదర్) ప్రభుత్వమే నిర్వహిస్తుందని ప్రకటించారు. పండుగలను ప్రభుత్వమే నిర్వహించడం వెనక ఓట్లు దండుకోవాలనే కాంక్ష తప్ప ఏముంది?