కుర్చీ ఖాళీగా వుందని కూర్చున్నావా.? కత్తి ఖాళీగా వుందని పొడిచేసుకుంటావా.! నెటిజన్లు సంధిస్తున్న ప్రశ్న ఇది. స్వయం ప్రకటిత దేవత రాధేమా, ఓ కేసులో విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కి వెళితే, అక్కడ ఉన్నతాధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆమె మీద వున్న భక్తి అలాంటిది మరి.! భక్తులు అంతలా తనని చూసి భక్తి పారవశ్యంలో మునిగిపోతే, రాధేమా తనను తాను దేవతగా కాక ఇంకెలా ఫీలవుతుంది.? అందుకే, అక్కడ ఓ సింహాసనం కన్పిస్తే, అందులో కూర్చుంది. అంతే, అది కాస్తా వివాదాస్పదమయ్యింది.
ఇక్కడ, రాధేమా తప్పు ఎంతుందన్న విషయాన్ని పక్కన పెడితే, భక్తి ముసుగులో ఉద్యోగ ధర్మాన్ని మర్చిపోయిన పోలీసులు మాత్రం ఖచ్చితంగా శిక్షార్హులే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. 'అది మామూలు కుర్చీ అనుకున్నాను.. ఉన్నతాధికారి కూర్చునే కుర్చీ అనుకోలేదు..' అంటూ రాధేమా 'నంగనాచి' కబుర్లు చెబుతోందిప్పుడు. అంతే, అంతకు మించి ఆమె నుంచి ఇంకెలాంటి మాటల్ని ఆశించగలం.?
స్వామీజీలు, మాతాజీలు.. ఎవరైనాసరే, దాదాపుగా చేసేదొకటి. భక్తి అనే ఓ మైకంలో జనాన్ని ముంచేస్తారు. ఆ తర్వాత ఆ భక్తి పేరుతోనే వారిని బ్లాక్‌మెయిల్ చేస్తుంటారు. పైకి, నిరాడంబరంగా కన్పించేవారు కొందరు.. అలా కన్పించేవారిలో చాలామంది తెరవెనుకాల చేసే జల్సా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక, ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే, సామీజీలైతేనేం.. మాతాజీలైతేనేం.. గ్రాండ్ లుక్‌తో కన్పించాలనుకుంటున్నారు. రాధేమా ఈ రెండో టైపు మాతాజీ.
సంప్రదాయ దుస్తుల్లోనే కాదు, హాట్ హాట్ దుస్తుల్లోనూ రాధేమా హల్‌చల్ చేస్తుంటుంది. అయితే, తెరవెనుక వ్యవహారం. మొత్తమ్మీద, ఇలాంటోళ్ళని సమాజంలో 'ఎదగనిస్తున్నందుకు' మన సమాజాన్ని మనమే నిందించుకోవాలి.