మహా టీవీ ఛలో ఆంధ్ర

తెలుగుదేశం కీలక నేత, కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెందిన చానెల్ మహా టీవీ. ఈ చానెల్ అనుకున్నట్లు క్లిక్ కాలేదు. ఏదో నడుస్తోంది. అంటే నడుస్తోంది అన్నట్లు వుంది ఇన్నాళ్లు. నిజానికి సుజనా…

తెలుగుదేశం కీలక నేత, కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెందిన చానెల్ మహా టీవీ. ఈ చానెల్ అనుకున్నట్లు క్లిక్ కాలేదు. ఏదో నడుస్తోంది. అంటే నడుస్తోంది అన్నట్లు వుంది ఇన్నాళ్లు. నిజానికి సుజనా చౌదరి తలచుకుంటే దీన్ని సర్రున పైకి లేపడం పెద్ద కష్టం కాదు. కానీ ఎందుకో ఆయన దానిపై పెద్దగా శ్రద్ద పెట్టలేదు సీనియర్ జర్నలిస్ట్ ఐ వెంకట్రావ్ కొన్నాళ్లు నడిపారు. తరువాత ఆయనను కేవలం కొన్ని కార్యక్రమాలకే పరిమితం చేసారు. అప్పట్లో ఇలా తలకాయలు మార్చి చాలా ప్రయోగాలు చేసారు.

ఇప్పడు ఈ చానెల్ ఆంధ్రకు షిప్ట్ అయిపోతోంది. మరో రెండు నెల్లలో ఆంధ్ర నుంచి ప్రసారాలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ వున్న కీలక ఎక్విప్ మెంట్, ప్రధాన సిబ్బంది విజయవాడకు తరిలిపోవడానికి రంగం సిద్దం అవుతోంది. ఈ చానెల్ విజయవాడ రిపోర్టర్, చానెల్ లో కీలక బాధ్యుడు, వంశీ ఇప్పడు మొత్తం వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు.

ఆయన మధ్యవర్తిత్వంతో, గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు, వారి సంబంధీకులైన కొందరు ఎన్నారైలు కలిసి ఈ చానెల్ లో మేజర్ స్టేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా తీసుకున్నవారు టీడీపీ నేత కోడెలకు సన్నిహితులు అని కూడా వినిపిస్తోంది. ఎవరైతేనేం మొత్తానికి మహా టీవీలో వాటాల అమ్మకం జరిగిపోయింది. చానెల్ విజయవాడకు షిప్ట్ అవుతోంది. అందువల్ల మంచి రోజులు వచ్చాయని సిబ్బంది సంతోషపడుతున్నారు.

కానీ అదే సమయంలో కొందరిని తొలగించడం, మరి కొందరిని తీసుకురావడం వంటి కార్యక్రమాలు కూడా ప్రారంభమైనట్లు వినికిడి. ఇది మాత్రం పాపం, చిరకాలంగా చానెల్ ను నమ్మకున్నవారికి కష్టమైన విషయమే.