బన్నీ క్యాంప్ కు క్వాలిటీ ఓసిడీ?

బన్నీ.. స్టయిలిష్ స్టార్. అతనితో సినిమా చేయడం ఏ డైరక్టర్ కు అయినా ఆనందమే. కానీ ఇప్పుడు ఏ పెద్ద డైరక్టర్లూ కూడా బన్నీ దగ్గరకు వెళ్లడానికి ఉత్సాహంగా లేరు. పైకి చెప్పకున్నా ఇది…

బన్నీ.. స్టయిలిష్ స్టార్. అతనితో సినిమా చేయడం ఏ డైరక్టర్ కు అయినా ఆనందమే. కానీ ఇప్పుడు ఏ పెద్ద డైరక్టర్లూ కూడా బన్నీ దగ్గరకు వెళ్లడానికి ఉత్సాహంగా లేరు. పైకి చెప్పకున్నా ఇది వాస్తవం. ఆఫ్ ది రికార్డుగా బన్నీ క్యాంప్ పై పెద్ద డైరక్టర్లు చెప్పే మాటలు వేరుగా వుంటాయి. ఆన్ ది రికార్డుగా వేరుగా వుంటాయి. ఎవరైనా కొత్త డైరక్టర్ సినిమా చేసి, హిట్ కొడితే వెంటనే బన్నీ నుంచి అభినందనల కాల్ వస్తుంది.

మంచి కథ వుంటే చూడు సినిమా చేద్దాం అనే ఆఫర్ దాంతో పాటే వస్తుంది. దాంతో కొత్త దర్శకులు సహజంగానే ఇష్టపడతారు. సరదా పడతారు. కానీ ఇప్పటికి ఇలా ఫోన్ కాల్స్ అందుకున్న వారు ఎందరో వున్నారు. కానీ సినిమా చేసిన వారు ఒక్కరూ లేరు. కారణం…?

ఇక సీనియర్ డైరక్టర్ల సంగతి. వాళ్ల అంతట వాళ్లు వెళ్లారు అంటే, ఇక తప్పలేదు. మరో ఆపర్ లేదు ప్రస్తుతానికి అనే అనుకోవాలి. కావాలంటే గడచిన మూడేళ్లలొ పెద్ద డైరక్టర్లు సినిమాలు చేసిన సమయంలో వాళ్ల పరిస్థితి చూడొచ్చు. ఇప్పుడు కూడా పలువురు పెద్ద డైరక్టర్లకు బన్నీ ఆఫర్లు వుండనే వున్నాయి. కానీ ఎక్కడా సినిమాలు ఏవీ? కారణం?

అటు అరవింద్.. ఇటు బన్నీ

పెద్ద డైరక్టర్లు ఆఫ్ ది రికార్డుగా చెప్పే కారణాలు చాలా వున్నాయి. అందులో కీలకమైనది. ఒకసారి ఆ క్యాంప్ లోకి అడుగుపెడితే, సినిమా పూర్తి చేసి, రావడానికి చాలా అంటే చాలా సమయం పడుతుంది. ముందు కథను అరవింద్ ఓకే చేయాలి. ఆపై బన్నీ ఓకె అనాలి. అక్కడితో అయిపోదు. ఆ కథను అక్కడ మార్చు.. ఇక్కడ మార్చు.. అలా మార్చు.. ఇలా మార్చు.. అది బాగోలేదు.. ఇది బాగోలేదు.. ఇలా స్టార్ట్ అవుతుంది. పిండేయడం. అలా పిండి పిండిన తరువాత సెట్ మీదకు వెళ్లడం జరుగుతుంది.

అక్కడి నుంచి కూడా దర్శకుడు చేసేది వుండదు. టెక్నికల్ టీమ్ సెలక్షన్ అంతా బన్నీ చాయిస్ నే. హీరోయిన్ కూడా. కేవలం జనరల్ కాస్టింగ్ మాత్రమే దర్శకుడు చూసుకుంటాడు. ఇక స్టయిలింగ్, పాటలు, ఫైట్లు అన్నీ బన్నీ టేస్ట్ కు అనుకూలంగానే వెళ్తాయి. రెగ్యులర్ సీన్లు దర్శకుడు చూసుకుంటే చాలు.

ఒకసారి బన్నీతో సినిమా చేసిన పెద్ద దర్శకులు ఇలాంటి కారణాలు చాలా చెబుతారు. ‘ఆ క్యాంప్ లో సినిమా చేసేలోగా, బయట రెండు సినిమాలు చేసేయచ్చు. రెండు రెమ్యూనిరేషన్లు వస్తాయి’ అన్నారు ఓ పెద్ద దర్శకుడు. దీన్ని బట్టి కాస్త లీడ్ లో వున్న దర్శకులు ఎవరూ బన్నీ దగ్గరకు ఎందుకు వెళ్లడం లేదో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పడు బన్నీ వర్థమాన దర్శకులు, హిట్ ట్రాక్ వున్న మీడియం దర్శకులను చూసుకుంటున్నాడు.

ఎక్కడికిపోతావు చిన్నవాడా లాంటి హర్రర్ సినిమా చేసి, మళ్లీ దాదాపు అలాంటి హర్రర్ సినిమానే అల్లు శిరీష్ తో చేస్తున్న యువి ఆనంద్ కు బన్నీ సినిమా కోసం అడ్వాన్స్ అందింది. రెండు మీడియం హిట్ లు కొట్టి, మూడో సినిమా ను ఓ యంగ్ హీరోతో రెడీ చేయబోతున్న డైరక్టర్ కు బన్నీ ఆపర్ వుండనే వుంది. గీతా క్యాంప్ మనిషి అనుకునే ఓ ‘క్లీన్’ హిట్ డైరక్టర్ కు బన్నీ ఆఫర్ రెడీగా వుంది.

కానీ ఇప్పటికిప్పుడు చేస్తున్న వక్కంతం వంశీ సినిమా పూర్తయితే, వెంటనే లేదా, దీంతో సమాంతరంగా సెట్ మీదకు తీసుకెళ్లడానికి ఒక్క స్క్రిప్ట్ కూడా రెడీ గా లేదని వినికిడి. బన్నీకి మంచి హిట్ లు అయితే వున్నాయి. రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు ఇలా. కానీ ఆ డైరక్టర్లు అంతా వేరే హీరోలతో బిజీ అయిపోయారు. 

కొరటాల శివ మళ్లీ మళ్లీ ఎన్టీఆర్, మహేష్ తో చేసినట్లు, త్రివిక్రమ్ పవన్ తో చేసినట్లు బన్నీ దగ్గరకు రాలేదు వీళ్లు. రెండు సినిమాలు చేసిన త్రివిక్రమ్ ఆ తరువాత గ్యాప్ వచ్చినా వెయిట్ చేసి పవన్ సినిమాకే వెళ్లారు తప్ప ఇటు రాలేదు. బోయపాటి ఇప్పుడు రామ్ చరణ్ కోసం చూస్తున్నారు తప్ప ఇటు రావడం లేదు ఎందుకనో? సురేందర్ రెడ్డి వెళ్లి చరణ్ క్యాంప్ లో ఫిక్సయిపోయారు.

క్వాలిటీ కోసం జాగ్రత్త పడడం అవసరమే. కానీ, మరీ క్వాలిటీ అనేది ఓసిడి గా మారిపోతే, పెద్ద డైరక్టర్లు బన్నీ తో సినిమా అంటే కాస్త దూరంగానే వుంటారేమో?