లిక్కర్ కింగ్, కింగ్‌ఫిషర్ అధినేత, బిజినెస్ టైకూన్.. ఇలా విజయ్ మాల్యా గురించి చెప్పాలంటే 'ఉపమానాలు' చాలానే వున్నాయి. అన్నిటికీ మించి, ఆయన రాజ్యసభ్యుడిగానూ పనిచేశారు. దేశ దౌర్భాగ్యమేంటంటే, ఆర్థిక నేరస్తుల్ని చట్ట సభలకు పంపించడం. తప్పదు మరి, రాజకీయ పార్టీలకు 'కాసుల పంట' పండేది సదరు ఆర్థిక నేరస్తుల వల్లనే కదా.! ఇదే మరి, మన ఘన ప్రజాస్వామ్యం.!
ఇక, అసలు విషయానికొస్తే విజయ్‌మాల్యాకి 'పబ్లిసిటీ' అంటే భలే ఇష్టం. ఆ పబ్లిసిటీ కోసమే కోట్లు ఖర్చు చేశాడు. మీడియా సంస్థల్నీ ఆయన తన గుప్పిట్లో పెట్టుకున్నాడు ఒకప్పుడు. అడుగేస్తే పబ్లిసిటీ, అడుగు తీస్తే పబ్లిసిటీ.. ఇదీ విజయ్ మాల్యా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన తీరు. దేశం నుంచి 'దొంగలా' పారిపోయిన విజయ్‌మాల్యా, బ్రిటన్‌లో తలదాచుకున్నాడు. 'కుక్క తోక వంకర' అన్నట్లుగా, విజయ్‌మాల్యా, అక్కడా పబ్లిసిటీ స్టంట్లు ఆపలేదు.
భారతదేశంలో విజయ్‌మాల్యా ఆర్థిక నేరాలకు సంబంధించి కేసులు, అరెస్ట్ వారెంట్లు చాలానే వున్నాయి. భారత్ – బ్రిటన్ మధ్య విజయ్‌మాల్యాకి సంబంధించి చర్చలు జరుగుతూ జరుగుతూ కొంతమేర కొలిక్కి రావడం, ఈ క్రమంలోనే ఓసారి విజయ్‌మాల్యా బ్రిటన్‌లో అరెస్ట్ అవడం తెల్సిన విషయాలే. 'నేను విసిరేసిన ఎంగిలి మెతుకులు తిన్నవారే, ఇప్పుడు నన్ను విమర్శిస్తూ కథనాలు పుట్టిస్తున్నారు..' అంటూ ఆ అరెస్ట్ తర్వాత విజయ్‌మాల్యా సోషల్ మీడియాలో విరుచుకుపడిపోయారు.
అది గతం. మళ్ళీ ఇప్పుడు, ఇంకోసారి విజయ్‌మాల్యా అరెస్ట్ అయ్యాడు బ్రిటన్‌లో. ఇప్పుడూ అంతే, అరెస్టయిన కాస్సేపటికే బెయిల్ దొరికింది. ఇంకేముంది, సోషల్ మీడియాలో మళ్ళీ విజయ్‌మాల్యా చెలరేగిపోతాడు.
'నాకు పబ్లిసిటీ అవసరం లేదు.. నా పేరుతో మీరు ఫ్రీ పబ్లిసిటీ చేసుకుంటున్నారు..' అంటూ గతంలోనే వెకిలి చేష్టలు చేసిన విజయ్‌మాల్యా, ఇప్పుడూ అదే తరహాలో నోరు పారేసుకోవడం పెద్ద వింతేమా కాదు. నేరస్తుడికి శిక్ష పడినప్పుడు, ఆ శిక్ష ఆ నేరానికి తగినంత కఠినంగా వున్నప్పుడు మాత్రమే భయం పుడుతుంది. లేకపోతే, ఇదిగో.. ఇలాగే, ఆర్థిక నేరస్తులు కాలరెగరేస్తారు.. చేసింది సిగ్గుమాలిన పని అయినాసరే.!