ఈ కాలంలో సినిమాలు నిర్మించడం సులువేకానీ, విడుదల చేయడం, అమ్మకాలు, తీరా విడుదలయిన తరువాత ప్రజాదరణ అన్నవి ఎవరి చేతిలోనూ లేని కష్టమైన విషయాలు. అలాంటిది సినిమా విడుదలకు ముందు కాస్త బ్రేక్ ఈవెన్ అవుతోంది అంటే అదృష్టమే. పివిపి సంస్థ నిర్మించిన రాజుగారి గది-2 సినిమా విడుదలకు ముందే బ్రేక్ ఈవెన్ దశకు చేరుకుంది.
ఉత్తరాంధ్ర, నైజాం, ఓవర్ సీస్ నిర్మాత వుంచుకుని, సీడెడ్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ఈస్ట్, వెస్ట్ అమ్మేసారు. శాటిలైట్ బేరం దాదాపు కొలిక్కి వచ్చింది. ఇవన్నీ కలిపి నిర్మాణ వ్యయం దాదాపుగా రాబట్టేసారు. రాజుగారి గది-2 సినిమా నాగ్, సమంత, వెన్నెల కిషోర్ లాంటి స్టార్ కాస్ట్ వుండడంతో, విజువల్ ఎఫెక్ట్స్ కాస్త ఎక్కువగానే చేయాల్సి రావడంతో 20 కోట్ల వరకు వ్యయం అయినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు జరిగిన అమ్మకాలతో రికవరీ అయిపోయింది. రాజుగారి గది ఫస్ట్ పార్ట్ కు వచ్చిన క్రేజ్, నాగ్, సమంత వుండడం కలిసి వచ్చినట్లుంది. అక్టోబర్ 13న విడుదలవుతున్న ఈ సినిమా మీద పివిపి సంస్థ చాలా ఆశలు పెట్టుకుంది. ఘాజీ, క్షణం, ఊపిరి తరువాత మళ్లీ సంస్థకు లాభాలు తెచ్చే సినిమా అవుతుందని ఆశిస్తోంది.