జనాలకు సెంటిమెంట్లు వుండడం కామన్. కానీ సినిమా రంగంలో వున్నన్ని సెంటిమెంట్లు ఎక్కడా వుండవు. ఎందుకంటే ఇక్కడంతా కోట్లతో ముడిపడిన వ్యవహారం. ఎవరైనా ఓ పాజెక్టు స్టార్ట్ చేసారంటే దాన్ని సెంటిమెంట్లతో ముందుగా బేరీజు వేయడం ఇండస్ట్రీ జనాలకు అలవాటు. టాలీవుడ్ బిగ్ డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ దిల్ రాజు లేటెస్ట్ ప్రాజెక్టుపై ఇలాంటి సెంటిమెంట్ కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే ఎస్ శంకర్ మాంచి దర్శకుడు. ఇంకా చెప్పాలంటే సౌత్ సినిమాను వరల్డ్ రేంజ్ కు తీసుకెళ్లిన అతి కొద్దిమంది దర్శకుల్లో శంకర్ ఒకరు. ఆయన సినిమాలు చాలా వరకు బ్లాక్ బస్టర్లే. సంచలనాలు నమోదు చేసినవే. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన రూపొందిస్తున్న 2.0 (రోబో 2) అయితే అయిదు వందల కోట్ల సినిమా అవుతుందంటున్నారు. అలాంటి శంకర్ తో కలిసి టాలీవుఢ్ లో టాప్ డిస్ట్రిబ్యూటర్ గా, కాస్త టేస్ట్ వున్న నిర్మాతగా పేరు తెచ్చకున్న దిల్ రాజు ఓ సినిమా నిర్మాణానికి దిగబోతున్నారు. కమల్ హసన్ హీరోగా గతంలో వచ్చిన భారతీయుడు (ఇండియన్) సినిమాకు సీక్వెల్ నిర్మించబోతున్నారు. ఈ మేరకు లాంఛనప్రాయంగా ప్రకటన వెలువడింది.
అయితే శంకర్ ఓకె. ఆయన సినిమాలు ఓకె. కానీ ఆయనతో సినిమాలు నిర్మించిన నిర్మాతల పరిస్థితి ఏమిటి? సినిమాలు హిట్ అయి, డబ్బులు వచ్చినా, కాలగమనంలో మాత్రం శంకర్ తో సినిమాలు తీసిన నిర్మాతలు ఎవరూ అంతగా లైమ్ లైట్ లో మిగిలిన దాఖలాలులేవు. శంకర్ తో నిర్మాత ఎఎమ్ రత్నం చాలా సినిమాలు తీసారు. కానీ ఆ తరువాత తరువాత ఆర్థికంగా చితికిపోయారు. హీరో అజిత్ ఆదుకుని వరుసగా సినిమాలు ఇస్తే కాస్త తేరుకున్నారు. కానీ ఇప్పటికీ ఓ భారీ సినిమా తీసే పరిస్థితిలేదు. గోపీచంద్ హీరోగా ఆక్సిజన్ సినిమా నిర్మించారు కానీ, విడుదల కాక ఇబ్బందులు పడుతున్నారు.
ఆస్కార్ రవిచంద్రన్ కూడా శంకర్ నిర్మాతే. ఆయన సినిమా నిర్మించి, పంపిణీ చేసి రెండేళ్లు దాటుతోంది. ఎవిఎమ్ వారు ఓ సినిమా (శివాజీ) నిర్మించారు. ఇప్పుడు ఆ బ్యానర్ లో సినిమా వచ్చి చాలాకాలం అయింది. ఇక నిర్మాత కుంజుమోన్ సంగతి అయితే మరీ తీసికట్టు అని చెన్నయ్ వర్గాల బోగట్టా. ఇక సన్ నెట్ వర్క్ సంస్థ రోబో సినిమా నిర్మించింది. ఆ నెట్ వర్క్ అధినేతలు ఎన్నికష్టాలు పడుతున్నారో తెలిసిందే. ఇలా దాదాపు శంకర్ తో సినిమా నిర్మించిన వారు ఎవ్వరూ ఇప్పుడు దాదాపుగా లైమ్ లైట్ లో లేకపోగా, కాస్త కష్టాలు, ఇబ్బందులు పడినవారు, పడుతున్నవారే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి ఇండియన్ 2 (భారతీయుడు 2) సినిమాకు నిర్మాతల కోసం శంకర్ చాలా మందినే సంప్రదించినట్లు తెలుస్తోంది. అలా సంప్రదించిన వారిలో సన్ నెట్ వర్క్, బాహుబలి నిర్మాతలు కూడా వున్నట్లు తెలుస్తోంది. అయితే వారెవరు అంతగా ఆసక్తి కనబర్చలేదని వినికిడి. దాంతో ఇప్పుడు ప్రాజెక్టు దిల్ రాజు చేతిలోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ సెంటిమెంట్ గ్యాసిప్ లు ఇండస్ట్రీలో వినిపించడం ప్రారంభమైంది.