ఎంటర్టైన్మెంట్.. ఎంటర్టైన్మెంట్.. ఎంటర్టైన్మెంట్.. ఇదే అక్కడి ప్రత్యేకత. కాసినోలకి కొదవ లేదు. ఎంటర్టైన్మెంట్ గురించి చెప్పుకోవాలంటే, ఆ ఆనందానికి ఆకాశమే హద్దు. అందుకే, లాస్ వెగాస్ పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంటుంది. ఇప్పుడీ లాస్ వెగాస్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది.. కానీ, కారణం వేరు.!
చేతిలో గన్, ఒంటి నిండా ఉన్మాదం.. ఇంకేముంది, విచ్చలవిడిగా కాల్పులు జరిపేశాడు. పైగా, కాల్పులు జరిపిన వ్యక్తి వయసు 60 ఏళ్ళకు పైనేనట. ఈ ఘటనలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారంటే ఎంతటి ఘోరమో అర్థం చేసుకోవచ్చు. అమెరికా అన్నాక, ఈ తరహా ఘటనలు అప్పుడప్పుడూ మామూలేనని లైట్ తీసుకోవడానికి వీల్లేదు. ఇటీవలి కాలంలో అత్యంత ఘోరమైన దుర్ఘటనగా లాస్ వెగాస్ కాల్పుల ఘటనను అభివర్ణించక తప్పని పరిస్థితి. అంత భారీ స్థాయిలో ప్రాణ నష్టం సంభవించింది మరి.
చిత్రంగా ఈ కాల్పుల ఘటనలో, ఉన్మాదికి ఓ మహిళ సహాయ సహకారాలు అందించింది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉన్మాదిని కాల్చి పారేశారు. ముందే చెప్పుకున్నాం కదా, లాస్ వెగాస్ అంటే ఎంటర్టైన్మెంట్ జోన్ అని. వివిధ దేశాలకు చెందినవారు సంఘటనా స్థలంలో వుండడంతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. మృతుల సంఖ్య గంట గంటకూ పెరుగుతుండడంతో, తమవారి ఆచూకీ కోసం ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందినవారు పడ్తున్న ఆవేదన అంతా ఇంతా కాదు.
మ్యూజిక్ ఫెస్టివల్‌కి హాజరైనవారినే లక్ష్యంగా చేసుకుని ఉన్మాది కాల్పులు జరిపాడు. ఏదో జరిగిందని తెలుసుకునేలోపే, చాలామంది విగతజీవులుగా మారిపోవడం దురదృష్టకరం.