అత‌ను ‘చేతి’కి చిక్కిన‌ట్టేనా?

బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ వివేక్ వెంక‌ట‌స్వామి “చేతి”కి చిక్కారా? అంటే…ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. మాజీ ఎంపీలు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి, వివేకా వెంక‌ట‌స్వామి బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరుతార‌నే ప్ర‌చారం కొంత కాలంగా…

బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ వివేక్ వెంక‌ట‌స్వామి “చేతి”కి చిక్కారా? అంటే…ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. మాజీ ఎంపీలు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి, వివేకా వెంక‌ట‌స్వామి బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరుతార‌నే ప్ర‌చారం కొంత కాలంగా సాగుతోంది. కోమ‌టిరెడ్డి కాంగ్రెస్‌లో చేరి, మునుగోడు టికెట్‌ను కూడా ద‌క్కించుకున్నారు. ఇక వివేక్ వంతే మిగిలింది.

రెండు రోజుల క్రితం పార్టీ మార‌డంపై వివేక్‌ను మీడియా ప్ర‌శ్నించింది. తాను పార్టీ మారుతాన‌నే ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని కొట్టి పారేశారు. పెద్ద‌ప‌ల్లి లోక్‌స‌భ స్థానం నుంచి బీజేపీ త‌ర‌పున ఎంపీగా బ‌రిలో దిగుతాన‌ని కూడా ఆయ‌న స్ప‌ష్టం చేశారు. దీంతో వివేక్ పార్టీ మార్పు ప్ర‌చారానికి ఇక తెర‌ప‌డిన‌ట్టే అని అంతా భావించారు.

ఈ నేప‌థ్యంలో వివేక్‌తో గ‌త రాత్రి టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి భేటీ కావ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇద్ద‌రి మ‌ధ్య సుదీర్ఘంగా చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్టు స‌మాచారం. కాంగ్రెస్ పార్టీలోకి రావాల‌ని వివేక్‌ను రేవంత్‌రెడ్డి ఆహ్వానించిన‌ట్టు తెలిసింది.  వివేక్ వైపు నుంచి సానుకూల సంకేతాలు రావ‌డంతోనే రేవంత్‌రెడ్డి వెళ్లి క‌లిసిన‌ట్టు కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు. కాంగ్రెస్‌లో వివేక్ పుట్టి, పెరిగారు. వివేక్ తండ్రి వెంక‌ట‌స్వామి తుదిశ్వాస వర‌కూ కాంగ్రెస్‌లోనే కొన‌సాగారు.

కాంగ్రెస్ అనేది వివేక్ కుటుంబానికి మాతృ రాజ‌కీయ పార్టీ. పారిశ్రామిక‌వేత్త కూడా అయిన వివేక్ వ్య‌క్తిగ‌త కార‌ణాల రీత్యా బీఆర్ఎస్‌, ఆ త‌ర్వాత బీజేపీలోకి వెళ్లారు. కొంత కాలంగా ఆయ‌న బీజేపీ కార్య‌కలాపాల‌కు దూరంగా వుంటున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పుంజుకోవ‌డంతో ఇత‌ర పార్టీల నేత‌లు ఆ పార్టీ వైపు దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగానే వివేక్ కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. పెద్ద‌ప‌ల్లి ఎంపీ సీటును కాంగ్రెస్ పార్టీ వివేక్‌కు ఇవ్వొచ్చు. ఈ ఒప్పందం మేర‌కే వివేక్ ఆ పార్టీలో చేరే అవ‌కాశాలున్నాయి.