వారాహి యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై పవన్‌కల్యాణ్ చెలరేగిపోవడం టీడీపీకి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. గత పదేళ్లలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను జనసేన ప్రకటించలేదు. తాజాగా ఆ పని చేస్తుండడంతో టీడీపీ అవాక్కవుతోంది. మరోవైపు పొత్తుల గురించి మాట్లాడ్డం పవన్ మానేశారు. అది ఎన్నికలకు ముందు తేల్చుకుందామని పవన్ అంటున్నారు. దీంతో పొత్తులపై పవన్ వ్మూహాత్మకంగా వ్యవహరించడాన్ని టీడీపీ నిశితంగా గమనిస్తోంది.
మరోవైపు చంద్రబాబునాయుడు వరుసగా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నారు. పార్టీలో అంతర్గత విభేదాలు లేని చోట అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేస్తున్నారు. పొత్తులతో సంబంధం లేకుండానే చంద్రబాబు తన పని తాను చేసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్ కూడా టీడీపీతో సంబంధం లేకుండా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను ప్రకటించడం మొదలు పెట్టారు.
ఇటీవల తణుకు బహిరంగ సభలో జనసేన అభ్యర్థిగా విడివాడ రామచంద్రరావు పేరును పవన్‌కల్యాణ్ ప్రకటించారు. అంతేకాదు, గతంలో ఆయనకు టికెట్ ఇవ్వనందుకు పవన్ క్షమాపణ కూడా చెప్పారు. తాజాగా మూడు నియోజకవర్గాలకు ఆయన ఇన్‌చార్జ్‌లను ప్రకటించారు. నియామక పత్రాలు కూడా అందజేసి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. పిఠాపురం, రాజానగరం, కొవ్వూరు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లుగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, టీవీ రామారావులను ఆయన ప్రకటించడం ద్వారా, వీరే ఎన్నికల బరిలో వుంటారనే చర్చకు తెరలేచింది.
పవన్‌కల్యాణ్ తమకు మద్దతుదారుడిగా ఉంటాడని సంబరపడుతున్న టీడీపీ ఆశలపై జనసేన ఇన్‌చార్జ్‌ల ప్రకటన నీళ్లు పోసినట్టైంది. రానున్న రోజుల్లో అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి పవన్‌కల్యాణ్ దూకుడు ప్రదర్శిస్తారని జనసేన నాయకులు చెబుతున్నారు. తమతో సంబంధం లేకుండా చంద్రబాబునాయుడు తన పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నప్పుడు, పవన్‌కల్యాణ్ మాత్రం తన పార్టీని ఎందుకు బలిపెట్టుకుంటారని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం జనసేన ఇన్‌చార్జ్‌ల ప్రకటన మాత్రం టీడీపీకి కోపం తెప్పిస్తోంది.