జనసేన నాయకుడిని శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ రెండు చెంపలు వాయించి కొట్టారు. జనసేన ఆందోళన కార్యక్రమాన్ని అడ్డుకుని, పార్టీ నాయకుడు కొట్టే సోమును చెంపలు వాయించారు. దీనిమీద జనసేన నాయకులందరూ ఆగ్రహించారు. ‘నేను వచ్చి అదే శ్రీకాళహస్తిలో ధర్నా చేస్తాను.. నన్ను కూడా కొడతావా’ అంటూ పవన్ సీఐ అంజూయాదవ్ ను ఉద్దేశించి గోదావరి జిల్లాల్లో సభల్లో రంకెలు వేశారు. తన తడాఖా చూపిస్తానన్నారు. తీరా ఆయన శ్రీకాళహస్తిలో అడుగుపెట్టకుండా.. తిరుపతిలో మాత్రమే తన పర్యటనను ఎందుకు పరిమితం చేసుకున్నారు?
ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి- పలాయనవాదం! రెండు- అవకాశవాదం!!
శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్.. ఎదుటివారు ఎవరైనా సరే.. లెక్కలేకుండా వ్యవహరిస్తున్నారనేది చాలా సందర్భాల్లో తేలిపోయింది. గతంలోనూ అనేక వివాదాల్లో ఉన్న సీఐ అంజూయాదవ్.. తాజాగా జనసేన నాయకుడిని కొట్టడం జరిగింది. నిజానికి ఎక్కడైతే జనసేన నాయకుడిని ఆమె కొట్టారో.. అదే స్థలంలో పవన్ కల్యాణ్ ధర్నా చేసిఉంటే పార్టీకి గౌరవం దక్కేది. ఆమెపట్ల ఆయన విసిరిన సవాలుకు విలువ ఉండేది.
కానీ పవన్ అలా చేయడం లేదు. విమానాశ్రయంలో దిగి, రేణిగుంట పాత ఎయిర్ పోర్ట్ నుంచి తిరుపతి టౌన్ క్లబ్ వరకు ర్యాలీగా వెళ్లారు. సహజంగానే ఆయన వెంట అభిమానులు పోటెత్తడమూ, దానికి సంబంధించిన హంగామా అన్నీ యథావిధిగా ఉన్నాయి. సీఐ మీద పవన్ తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేస్తారు. అయితే శ్రీకాళహస్తిని వదిలేసి ఆయన తిరుపతిలో ఎందుకు తిరుగుతున్నారు. జనసేనాని శ్రీకాళహస్తి వీధుల్లో నిలబడి గర్జించలేని పక్షంలో అమరావతిలోనే డీజీపీనే కలిసి ఫిర్యాదు చేస్తే సరిపోయేది కదా.. అనేది పలువురు అనుమానం.
అయితే ఈ సంఘటనను కూడా రాజకీయ లబ్ధి కోసం మలుచుకునే లేకి వ్యూహం ఉన్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కల్యాణ్, తాను ఎమ్మెల్యేగా పోటీచేయడానికి ప్రాబబుల్స్ గా ఎంచుకుంటున్న నియోజకవర్గాల్లో తిరుపతి కూడా ఉంది. ఇంకా ఫైనల్ కాకపోయినప్పటికీ.. తిరుపతి నుంచి పోటీచేయాలని ఆయన అనుకుంటున్నారు.
తిరుపతిలో కాపు సామాజిక వర్గం డామినేషన్ తో పాటు, చిరంజీవి గెలిచిన చోట తాను ఇంకా సునాయాసంగా గెలుస్తాననే నమ్మకం ఆయనకు ఉంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఆందోళన నిర్వహించడం వల్ల పార్టీకి లాభం లేదని ఆయన అభిప్రాయం. ఆ నియోజకవర్గాన్ని పొత్తుల్లో తమ పార్టీ తీసుకునే ఆలోచన వారికి లేదు.
అందువల్లనే.. అవమానం శ్రీకాళహస్తిలో జరిగితే, ఆయన దానికి ప్రతీకారం తిరుపతిలో తీర్చుకుంటున్నారు. ఈ ముసుగులో తిరుపతిలో ఓ పెద్ద ర్యాలీ, ఆందోళన నిర్వహించి.. తమ పార్టీకి అనుకూల మైలేజీ తయారుచేసుకోవాలని పవన్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. తిరుపతి ఆందోళన వెనుకగల మర్మం తెలిసిన పార్టీ నాయకులే పవన్ ఆలోచనలను అసహ్యించుకుంటున్నారు.