ఈ మధ్య కాలంలో ఉస్తాద్ భగత్ సింగ్‌కు జరిగినంత హడావుడి మరే సినిమాకు జరగలేదు. జస్ట్ నాలుగు రోజులు షూట్ చేసి, గ్లింప్స్ అంటూ తెగ హడావుడి చేసారు. పైగా దాన్ని థియేటర్లో విడుదల చేసి హంగామా చేసారు. తరువాత ఈ పూజ.. ఆ పూజ అంటూ రకరకాల ఫోటోలు వదిలారు. ఆ వెంటనే మరో షెడ్యూలు వుందంటూ..’మనల్ని ఎవడ్రా ఆపేది’ అని ట్వీటేసారు. ఇన్నీ జరిగాయి కానీ ఆ సినిమా షూట్ కంటిన్యుటీ మాత్రం లేదు.
పవన్ కళ్యాణ్ తన ఓజి సినిమాను చకచకా కొంత వరకు పూర్తి చేసారు. బ్రో సినిమాను విడుదల దిశగా నడిపించారు. కానీ ఈ 100 రోజలు షూట్ చేయాల్సిన ఉస్తాద్ పరిస్థితి ఏమిటో తెలియలేదు. ఇప్పుడు కొత్తగా కొన్ని గ్యాసిప్ లు వినిపించడం మొదలైంది. ఉస్తాద్ సినిమా ఆగిపోయిందని, లేదు లేదు కొన్నాళ్లు ఆపారని, కాదు కాదు, ఎన్నికల తరువాత మళ్లీ వుంటుందని ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ లోగా మరో విషయం. రవితేజతో ఉస్తాద్ దర్శకుడు హరీష్ శంకర్ హిందీ సినిమా రైడ్ ను రీమేక్ చేస్తారని, పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తుందని వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా సంక్రాంతి నుంచి వుంటుందని తెలుస్తోంది. దర్శకుడు హరీష్ ఈ మేరకు పవన్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది. రాజకీయ కార్యకలాపాల దృష్ట్యా తాను బిజీగా వున్నందున ఉస్తాద్ ను పక్కన పెట్టి మరో సినిమా చేయడానికి ఓకె అన్నట్లు తెలుస్తోంది.
హరీష్ నే కాదు, హరిహర వీరమల్లు దర్శకుడు క్రిష్ ను కూడా ఓ సినిమా చేసుకోమని పవన్ చెప్పినట్లు వార్తలు వినవస్తున్నాయి. మరి క్రిష్ ఏం చేస్తారో చూడాలి.
అంతా బాగానే వుంది. హరీష్ సినిమా చేసుకోవచ్చు. క్రిష్ సినిమా చేయవచ్చు. మరి నిర్మాతల సంగతేమిటి? దాదాపు ఇద్దరు నిర్మాతలు చెరో యాభై కోట్లు ఖర్చు చేసేసారు వాళ్ల వాళ్ల సినిమాల మీద. ఇప్పుడు అవి అలా నెలల పాటు పక్కన పెడితే వాళ్ల సంగతేమిటి?