గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన వైసీపీకి, ఇప్పుడక్కడ అంతర్గత కుమ్ములాటలతో రోడ్డున పడింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైసీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. 2014లో వైసీపీ తరపున కిలివేటి సంజీవయ్య కేవలం 3,726 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాజకీయాల్లో కొత్తగా అడుగు పెట్టిన ఆయన… వైఎస్ జగన్ పుణ్యమా అని చట్టసభలో అడుగు పెట్టారు. మొదట్లో ఆయన సౌమ్యుడిగా వుంటూ, అందరినీ కలుపుకెళ్లేవారు.
బహుశా వైసీపీ ప్రతిపక్షంలో ఉండడం వల్లనేమో కిలివేటి సంజీవయ్య అసలు రూపం బయటపడలేదు. 2019లో సంజీవయ్యకు అందరూ మద్దతుగా నిలిచారు. దీంతో ఆయన 61, 292 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో సంజీవయ్య పెత్తనం ప్రారంభమైంది. ప్రత్యర్థుల కంటే సొంత పార్టీ వాళ్లనే ఆయన టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో సూళ్లూరుపేట నియోజకవర్గం వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి.
ముఖ్యంగా తమను కిలివేటి సంజీవయ్య ఓ పథకం ప్రకారం అణచివేయాలని కుట్రకు తెరలేపారని జగన్ సామాజిక వర్గం నేతలు ఆగ్రహంగా ఉన్నారు. మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ కళత్తూరు సునీల్‌రెడ్డిని పోలీసులతో చితక్కొట్టించడంతో వైసీపీ నేతలు భగ్గుమన్నారు. పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే… మరోసారి కిలివేటి సంజీవయ్యకు వైసీపీ టికెట్ ఇస్తే, సొంత పార్టీ నేతలే చందాలు వేసుకుని మరీ టీడీపీ అభ్యర్థిని గెలిపించేలా ఉన్నారు.
తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి చొరవతో అంతోఇంతో ఆ నియోజకవర్గ వైసీపీకి ఊరట లభిస్తోంది. వైసీపీ అధికారంలోకి రావడానికి ఆ నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు శ్రమను తిరుపతి ఎంపీ గుర్తించి, వారి అవసరాలను తీర్చేందుకు యత్నిస్తున్నారు. నిన్న సునీల్‌రెడ్డి వ్యవహారంలోనూ తిరుపతి ఎంపీ చొరవ తీసుకుని పోలీస్ అధికారులతో మాట్లాడ్డం వల్ల వైసీపీ నాయకుల పరువు నిలిచిందనే ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికైనా సూళ్లూరుపేట నియోజకవర్గంలో నెలకున్న వర్గ విభేదాలపై అధిష్టానం దృష్టి సారించాల్సిన అవసరం వుంది. లేదంటే ఎన్నికలకు ముందే ఎమ్మెల్యే సంజీవయ్యను సొంత పార్టీ నేతలు ఇంటికే పరిమితం చేసేలా ఉన్నారు.