ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైయస్సార్ కు సన్నిహితుడైన సీనియర్ నాయకుడికి చాలా ఎక్కువ ప్రాధాన్యమే ఇచ్చారు. గొప్ప పదవులే కట్టబెట్టారు. అది చాలదన్నట్లుగా.. తన కుటుంబంలో మరిన్ని పదవులు దక్కాలని కోరుకుంటున్నట్లుగా ఆయన తెరవెనుక నిలుచుని పార్టీకి వ్యతిరేకంగా కుట్ర రాజకీయాలు నడిపిస్తూ ఉండడం విస్తుగొలుపుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు హద్దు దాటి బజారున పడ్డాయి.
ఈ నియోజకవర్గ నుంచి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సహజంగా వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో కూడా ఆయనకే టికెట్ కేటాయిస్తారని పార్టీలో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయనకు వ్యతిరేక వర్గం ఏర్పడింది. వారు చాలా పెద్ద రాద్ధాంతమే చేస్తున్నారు. అయితే ఈ వ్యతిరేకవర్గం రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అనుచరులు కావడం గమనార్హం.
పిల్లి సుభాష్ చంద్రబోస్, వైయస్ రాజశేఖర్ రెడ్డికి దగ్గరి అనుచరుడు! అయితే అప్పట్లో పార్టీ టికెట్ దక్కక ఇండిపెండెంట్ గా, తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. గెలిచిన తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆయనను మళ్ళీ పార్టీలో చేర్చుకుని అందలాలు ఎక్కించారు.
జగన్మోహన్ రెడ్డి కూడా తొలి నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ కు తగిన ప్రాధాన్యం ఇస్తూనే వచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి క్యాబినెట్ లోనే ఆయనను మంత్రిగా తీసుకున్నారు. ఆ వెంటనే రాజ్యసభ పదవుల అవకాశం రావడంతో మంత్రిగా రాజీనామా చేయించి రాజ్యసభకు పంపారు. ఇలా అన్ని రకాలుగానూ ఆయనను ప్రాధాన్య పోస్టులలోనే ఉంచుతున్నారు.
అయితే ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకు సూర్య ప్రకాష్ కు రామచంద్రపురం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని రగడ మొదలైంది. పిల్లి అనుచరులందరూ సమావేశం పెట్టుకొని పార్టీకి హెచ్చరిక చేశారు. వేణుగోపాలకృష్ణకు మళ్ళీ టికెట్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఓడించి తీరుతామని వారు అంటున్నారు. పిల్లి కుటుంబం స్వయంగా తెరమీదకు రాకపోయినప్పటికీ నడిపిస్తున్న సూత్రధారులు వారే అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.
వేణుకు టికెట్ నిరాకరించడానికి జగన్ ఒప్పుకోకపోతే గనుక పిల్లి సుభాష్ తనయుడు సూర్య ప్రకాష్ తండ్రి బాటనే అనుసరించి ఇండిపెండెంట్ గా పోటీ చేసి నెగ్గుతారా? అనే అనుమానం పలువురిలో కలుగుతోంది. తార స్థాయికి చేరిన రామచంద్రపురం నియోజకవర్గం ముఠాతగాదాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎలా చక్కబెడుతుందో వేచి చూడాలి.