జోస్యం చెప్పే కోయదొరలు అనుసరించి మార్కెటింగ్ టెక్నిక్కును ఎప్పుడైనా గమనించారా? పెద్ద పెద్ద సినిమా నటులు, రాజకీయ నాయకులు లాంటి సెలబ్రిటీలతో దిగిన ఫోటోలను ఒక ఆల్బంగా చేసుకుని తమ వెంట పెట్టుకుని ‘కుర్రో కుర్రు..’ అంటూ రోడ్ల మీద తిరుగుతుంటారు.
ఎవడైనా దొరికేలాగా కనిపిస్తే చాలు.. వెంటనే ఆల్బం తీసి ముందర పెట్టి.. పలానా పలానా గొప్పవాళ్లతో దిగిన ఫోటోలు చూపించి.. తాను అంత గొప్ప జ్యోతిష్యుడినని చెప్పుకుని.. వారికి కూడా జోస్యం చెప్పేస్తారు. ఇలాంటి కోయదొరల టెక్నిక్కులు, గిమ్మిక్కులనే ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా ఫాలో అవుతున్నారు.
ఈ హీరో తాజాగా ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు. యూత్ లో పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ మామూల్ది కాదని అందరికీ తెలిసిన సంగతే. దానికి తగ్గట్టుగానే .. ఇన్‌స్టా ఖాతా ఓపెన్ చేసి ఒక్క పోస్టు కూడా పెట్టక ముందే.. మిలియన్లలో ఫాలోయర్స్ వచ్చేశారు. మొత్తానికి తాపీగా పవన్ కల్యాణ్ తన తొలి పోస్టును ఇన్‌స్టాలో షేర్ చేసుకున్నారు.
చలనచిత్ర పరిశ్రమలో అనేక మంది ప్రముఖులతో తాను కలిసి దిగిన ఫోటోలు అన్నింటినీ కలిపి ఒక వీడియోగా తయారుచేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో.. పవన్ కలిసి పనిచేసిన నటులు, దర్శకులతో పాటు, ఆయన ఎన్నడూ కలిసి పనిచేయని వారు కూడా ఉన్నారు. మొత్తానికి సినిమా వాళ్లతో తాను దిగిన ఫోటో ఒకటి ఉంటే చాలు.. వాటన్నింటినీ కలిపి వీడియో చేశారు. అయితే ముందుజాగ్రత్తగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆలీ, మోహన్ బాబులతో ఫోటోలు మాత్రం ఆ వీడియోలో లేవు.
అసలే ఇన్‌స్టా బయోలో ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో.. జైహింద్ అనే వివరణతో ఉన్న ఈ ఇన్‌స్టా అకౌంట్ ను గమనిస్తే ఆయన రాజకీయంగా ప్రమోషన్ కోసం వాడుకోవడానికే అన్నట్లుగా తెలిసిపోతుంది. ఇతర సినీనటులతో తన అనుబంధాన్ని ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటూ తద్వారా.. ఆయా సినీనటుల అభిమానులు అందరూ కూడా.. రాజకీయంగా తనకు మద్దతు ఇవ్వాలని పవన్ కల్యాణ్ కోరుతున్నారు.
అసలే ప్రతి రాజకీయ బహిరంగ సభలోనూ.. ఎన్టీఆర్, ప్రభాస్ వంటి నటులంతా తనకు చాలా ఆప్తులని, వారి అభిమానులందరూ కూడా మద్దతివ్వాలని అడిగే పవన్ ఈ వీడియో ద్వారా కూడా అదే కోరుకుంటున్నారు.
అయితే ఈ తరహా గిమ్మిక్కులను గమనిస్తే.. కోయదొరల బాటనే ఫాలో అవుతున్నట్టుగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయినా సదరు సెలబ్రిటీ నటులందరూ ప్రచారానికి వస్తేనే ఓటర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. అలాంటిది.. ఆయన వీడియో తయారుచేసి వొదిలినంత మాత్రాన ఓట్లు రాలుతాయని అనుకుంటే భ్రమ!