సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయంటేనే.. రాజకీయ పార్టీలు తాము ఓటర్లను ఆకర్షించడానికి ఎలాంటి ఎత్తుగడలు వేయాలో మేథోమధనం చేస్తుంటారు. సరికొత్త వరాల రూపకల్పనలో సతమతం అవుతుంటారు. ‘మమ్మల్ని గెలిపించండి.. ఇలలోనే స్వర్గం చూపిస్తాం.. దివిలో ఉండే సకలం భువికి తీసుకువస్తాం..’ అంటూ నానా గారడీ విద్యలను ప్రదర్శిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల యవనికలో ఇప్పటికేఈ వాతావరణం ప్రస్ఫుటం అవుతోంది. తెలుగుదేశం, జనసేన పార్టీలు ఆ పనిలోనే ఉన్నాయి.
విపక్షాల ఊహలకు అందని విధంగా, వ్యూహాలలో ఒదగని విధంగా.. అధికార పార్టీ అసాధ్యపు పోకడలు పోతోంది. ‘మళ్లీ గెలిపిస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం..’ అనే మాటలే వినిపించడం లేదు. ‘ఇప్పటిదాకా మా నాలుగేళ్ల పాలనలో మీ కుటుంబంలో మేలు జరిగి ఉంటే మాత్రమే మీరు మా పార్టీకి ఓటు వేయండి’ అని మాత్రమే అడుగుతున్నారు. ఆశలు పెట్టి ఓట్లు కొల్లగొట్టే మాయ లేదు.. కనుల ముందు ససాక్ష్యంగా చేసిన సంక్షేమం ఉంటే మాత్రమే ఓటు వేయాలని కోరుతున్నారు. తమ సంక్షేమ ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు చెల్లించుకోమని మాత్రమే కాదు.. వెన్నుతట్టి ప్రోత్సహించే క్రమంలో భాగంగానే ఓటు వేయాలని అడుగుతున్నారు.
సమకాలీన రాజకీయ సరళిలో చాలా చిత్రమైన పోకడ ఇది. ప్రతిపక్షాలు సాహసించలేని, ఊహించలేని జగన్ వ్యూహం ఇది. ఈ వైఖరిపై విశ్లేషణే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ.. ‘ఓన్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్.. నో మేనిఫెస్టో!’
ఎన్నికల సమరభేరి మోగలేదు గానీ.. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం అంతకంటె వేడిగానే ఉంది. ఒకటిరెండు వారాల్లోనే పోలింగ్ జరగబోతున్నదా అనిపించేంతగా నాయకులు పర్యటనలు, సభలు.. దూషణలు, నిందలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజలను ఆకట్టుకోవడానికి పార్టీలు వరాలను ప్రకటించడం సహజం. ఆ వరాలే వారి మేనిఫెస్టోలు.
మేనిఫెస్టోలను గమనిస్తే ప్రతి పార్టీ కూడా.. మహనీయులు, మహాత్ములు నిండిన పార్టీగా కనిపిస్తుంది. ప్రజలకు వీరు తప్ప మరొకరు మంచి చేయలేరు.. అని భ్రమింపజేసేలా వారి హామీలు ఉంటాయి. మేనిఫెస్టోలలో అందరూ అద్భుతంగానే కనిపిస్తారు. కానీ ఆచరణలో ఎవరేమిటి? అనేది కీలకం. ఏపీ ఎన్నికల బరిలో ప్రధానంగా మూడు పార్టీలు తలపడుతున్న నేపథ్యంలో వారి వారి మేనిఫెస్టో ప్రయత్నాలను ఓసారి అవలోకిద్దాం.
అరచేతిలో వైకుంఠ బాబు!
చంద్రబాబునాయుడుకు ‘మేనిఫెస్టో’ అనే పదం పలికే అర్హత లేదు. ఎన్నికలకు ఏడాది ముందుగా ‘మినీ మేనిఫెస్టో’ అంటూ ఆయన మహానాడులో ఒక డ్రామా నడిపించి ఉండవచ్చు గాక. తెలుగుదేశం వందిమాగధులు, ఆయన తైనాతీలు, భృత్యులు, పచ్చదళాలు అందరూ కూడా.. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా సరైన సమయంలో విడుదల అవుతుంది అంటూ నాటకీయమైన డైలాగులు పలికి ఉండవచ్చు గాక. కానీ చంద్రబాబునాయుడుకు మేనిఫెస్టో అనే పదం పలికే అర్హత మాత్రం లేదు గాక లేదు.
అనేకానేక రూపాలలో మాయమాటలతో ప్రజలను వంచించడం అనేది తన రాజకీయ విధానంగా చెలరేగుతూ ఉండే చంద్రబాబునాయుడు.. అలాంటి వంచనలలో ‘మేనిఫెస్టో’ అనే పదాన్ని కూడా ఒక రాజమార్గంగా భావిస్తుంటారు. అందుకే ఆయన మేనిఫెస్టో ముసుగులో ఎన్ని మాటలైనా చెప్పగలరు! ప్రజలు తమ బుట్టలో పడేదాకా ఆ మేనిఫెస్టో అంశాలను ఆయన టముకువేసి ప్రచారం చేస్తారు. ప్రజలు నమ్మి తనకు అధికారం ఇచ్చినట్లయితే వాటిని చాలా సునాయాసంగా పక్కన పెట్టేయగలరు! అసలు ఏం ప్రమాణాలు చేశారో ఆధారాలు కూడా చిక్కకుండా మేనిఫెస్టో మూలాలను కూడా రూపుమాపగలరు.
2014 ఎన్నికలకు పూర్వం తెలుగుదేశం మేనిఫెస్టో అందుకు పెద్ద ఉదాహరణ. ప్రజలను బుట్టలో పడేయాలంటే తమ మేనిఫెస్టో చాలా ఘనంగా లావుగా ఉండాలనేది ఆయన నమ్మకం. అందుకే ప్రతిసారీ మేనిఫెస్టో అనే పేరుతో ఒక పెద్ద పుస్తకాన్ని ప్రచురిస్తూ ఉంటారు. దానిని ప్రజలను మాయచేయగల సమ్మోహక అస్త్రంలాగా మాత్రమే చంద్రబాబు ప్రయోగిస్తూ ఉంటారు. మేనిఫెస్టో పుస్తకంగా ఉండాలనే ఆయన నమ్మకం ఆయన ఇష్టం. అయితే.. ఆ పుస్తకం ఒక భగవద్గీతలాగా, ఒక ఖురాన్ లాగా, ఒక బైబిలుగా పవిత్రమైనదనే విశ్వాసం ఉండాలి.
అందులోని ప్రనతి అక్షరానికీ తాను త్రికరణ శుద్ధిగా జవాబుదారీతనం వహించాలనే పవిత్రభావన ఉండాలి. కానీ చంద్రబాబుకు అదిమాత్రం ఉండదు. అందుకే ఆయన 2014 ఎన్నికల్లో ఒక ఘనమైన మేనిఫెస్టోను ప్రకటించి.. ఎన్నికల తర్వాత.. దాన్ని మరచిపోయారు. అంతే కాదు.. ఏకంగా తమ పార్టీ వెబ్ సైట్ లోంచి కూడా దానిని తొలగించేశారు.
మేనిఫెస్టో అనేది ప్రజలకు కనిపిస్తే.. అందులోంచి తాను చేసిన ప్రతి వంచన కూడా ప్రజల కళ్లకు కడుతుందని ఆయన భయం. ఎన్నెన్ని వాగ్దానాల విషయంలో తాను మాట తప్పానో దొరికిపోతానని ఆయనకు భయం.
అలాంటి చంద్రబాబు ఈసారి ఏడాది ముందే మినీ మేనిఫెస్టో అన్నారు. అది పెద్ద మాయల మరాఠీ మేనిఫెస్టో!! ఎందుకంటే ఆయన ప్రకటించిన ఏ ఒక్క హామీలో కూడా స్పష్టత లేదు. అన్నీ అక్కర్లేదు.. ఎగ్జాంపుల్ కోసం ఒక్క హామీ తీసుకుందాం. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తానని అన్నారు. అంటే కేవలం తెల్ల రేషన్ కార్డులున్న వారికి మాత్రమేనా.. లేదా, తెలంగాణలో రైతుబంధు ఇచ్చినట్టుగా సంపన్నులకు కూడా ఇస్తారా? అనేది క్లారిటీ లేదు. ప్రతి హామీ కూడా ఇలాంటిదే.
ఎన్నికలు ముగిసేదాకా.. ఇలాంటి సందిగ్ధమైన హామీలు ఇవ్వడం. ఎన్నికలు ముగిశాక.. అప్పుడు నిబంధనలన్నిటినీ బయటకు తీయడం చంద్రబాబుకు అలవాటు. కుత్సితమైన వ్యాపారాలు చేసే సంస్థలు తాము ఇచ్చే ప్రకటనల్లో ఒక మూలన మానవనేత్రానికి కనిపించే అవకాశం లేనంత చిన్న ఫాంట్ సైజులో ‘టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై’ అనే నాలుగు మాటలను ముద్రిస్తారు. తెలుగుదేశం మేనిఫెస్టో మీద అలాంటి హెచ్చరిక మాటలు కూడా లేకుండా ప్రజలను వంచిస్తుంటారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఏమిటో తేల్చిచెప్పకుండా.. చంద్రబాబునాయుడు ఏ హామీ ఇచ్చినా సరే.. అందులో ఒక మాయ, ఒక వంచన ఉంటుందనేది తేలిపోయిన సంగతి.
చంద్రబాబునాయుడు తాను నిజాయితీ పరుడినే అని చెప్పుకోవాలంటే.. 2014 నాటి ఎన్నికల మేనిఫెస్టోను ఓసారి బయటపెట్టి.. అందులోని హామీలను అయిదేళ్లలో ఎన్నింటిని నెరవేర్చారో ప్రజలకు తెలియజెబితే బాగుంటుంది.
సొరకాయలు నరికే దత్తపుత్రుడు!
ఇక దత్తపుత్రుడి సంగతి. మేనిఫెస్టో అనేది ఒకటి తీసుకురావాలనేంత ఆలోచన ఆయనకు ఉంటుందనుకోవడం కూడా భ్రమ. పవన్ కళ్యాణ్ ప్రతి మాట కూడా ప్రజలతో బేరం పెడుతున్నట్టే ఉంటుంది! ‘‘మీరు నన్ను ముఖ్యమంత్రిని చేశారంటే, మీకోసం అది చేస్తాను ఇది చేస్తాను’ అని చెప్పడం ప్రస్తుత రాజకీయాల్లో కేవలం పవన్ కళ్యాణ్ కు మాత్రమే చెల్లింది! చిన్న చిన్న అణాకానీ పార్టీలు పెట్టుకున్న వారు కూడా ప్రజల ముందుకు వెళ్లిన సందర్భాలలో- ‘ఎన్నికలలో గెలిచినా ఓడిపోయినా కూడా ప్రజల బాగు కోసం కట్టుబడి ఉంటాం, ప్రజల సమస్యలపై నిత్యం పోరాడుతూ ఉంటాం, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం’ అని అంటూ ఉంటాయి!
కానీ రాజకీయాలలో ఉండవలసిన కనీస చిత్తశుద్ధి కూడా లేకుండా- ఒక పార్టీ పెట్టేసి తన సినిమా హీరో ఇమేజితో ముఖ్యమంత్రి అయిపోవచ్చునని కలలుకంటూ, మాటలు వల్లిస్తూ ఉండే పవన్ కళ్యాణ్- ఏ ఊరు వెళ్ళినా ఏ కులం వారితో భేటీలు నిర్వహించినా, ఏ ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించినా చెప్పే మాట ఒక్కటే ‘మీరు నన్ను ముఖ్యమంత్రిని చేయండి నేను మీ కోసం పని చేస్తా’ అని!! ఎంత అవమానకరమైన మాట ఇది?
ఇలాంటి బేరాలతో వ్యాపారం లాగా ప్రజలను డీల్ చేస్తూ ఉంటే వారు తనను చూసి నవ్వుకోరా అనే అభిప్రాయం కూడా పవన్ కళ్యాణ్ కు ఉన్నట్లు లేదు! ‘గాజువాకలో నన్ను గెలిపించి ఉంటే విశాఖ దోపిడీని అడ్డుకుని ఉండేవాడిని..’ అంటూ గెలిపించలేదు గనుక.. మీ చావు మీరు చావండి అని సంకేతాలు ఇవ్వగల నాయకుడు బహుశా పవన్ ఒక్కరే.
అలాంటి పవన్ కళ్యాణ్ ఇక మేనిఫెస్టోను ఏం తీసుకొస్తారు? ఒకవేళ ఆయన మేనిఫెస్టోని గనుక ప్రచురించేట్లయితే చంద్రబాబులాగా.. చిట్టచివరన ‘టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై’ అనే మాటలను చిన్నచిన్న అక్షరాలతో ప్రింట్ చేయించరు. దానికి బదులుగా.. ఒక లుక్ వేస్తే చాలు కొట్టొచ్చినట్లుగా కనబడే లాగా పెద్ద పెద్ద అక్షరాలతో తొలి పేజీలోనే కండిషన్స్ మొత్తం ప్రకటిస్తారేమో! ఆ కండిషన్స్ ఇలా ఉంటాయి..
1. నన్ను ముఖ్యమంత్రిని చేయాలి. 2. జనసేన పార్టీకి 70కి పైగా సీట్లు కట్టబెట్టాలి. 3. భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రంలో అధికారంలోకి రావాలి. 4. నేను చేసిన సవాలు ఫలించాలి- అనగా, ఉభయగోదావరి జిల్లాలలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాకూడదు. ఇలాంటివన్నీ తప్పనిసరిగా నెరవేరితే అప్పుడు ఈ మానిఫెస్టోలోని వాగ్దానాలు నెరవేరుస్తా అని ప్రకటిస్తారేమో అని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు!
ప్రోగ్రెస్ రిపోర్టే.. జగన్ శైలి!
‘మీకు ఇంకా ఫలానా ఫలానా సేవ చేయాలని ఉంది.. నాకు ఓట్లు వేసి గెలిపించండి’ అని పార్టీలు అభ్యర్థించడం రివాజు. ఏం చేయాలని అనుకుంటున్నారో దానినే మనం మేనిఫెస్టో అంటాం. కానీ.. ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతున్న తీరు చాలా విలక్షణంగా, ఊహకందని రీతిలో ఉంది! శత్రువులకు దుర్గ్రాహ్యమైన పోకడలు అవి. జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు వెళ్లి.. ‘‘మీ బిడ్డ పరిపాలనలో.. మీ కుటుంబానికి మేలు జరిగి ఉంటే మాత్రమే మీరు ఓటు వేయండి. లేకపోతే ఓటు వేయవద్దు’’ అని అంటున్నారు.
నా వల్ల మీకు మేలు జరిగి ఉండకపోతే.. ఓటు వేయవద్దు- అని చెప్పగల ధైర్యం ఎవరికి ఉంటుంది. సమకాలీన రాజకీయాలలో తాను అసమానమైన ఆత్మవిశ్వాసం కలిగిన, ప్రజావిశ్వాసాన్ని చూరగొన్న నాయకుడిని.. అని జగన్ నిర్ద్వంద్వంగా నిరూపించుకుంటున్నారు.
ఇలాంటి ప్రకటన చేయాలంటే చాలా దమ్ము ఉండాలి. నిజం చెప్పాలంటే.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందే లక్షలాది మందిలో.. ప్రత్యర్థి పార్టీలకు చెందిన కరడుగట్టిన అభిమానులు కూడా ఉంటారు. అంటే నూరుశాతం లబ్ధిదారుల ఓట్లు వస్తాయనుకోవడం భ్రమ. అయినా సరే.. ‘నా వల్ల మేలు జరిగి ఉంటేనే ఓట్లు వేయండి, లేకపోతే వద్దు’ అనడానికి.. తాను అనల్పమైన సంక్షేమాన్ని ప్రజలకు అందించాననే నమ్మకం ఉండాలి.
మేనిఫెస్టో అనే పదాన్ని 2019 ఎన్నికల సమయంలో పునర్నిర్వచించారు జగన్. కేవలం ఒక పేజీతో తన పార్టీ మేనిఫెస్టో తెచ్చారు. వాటి అమలులోనూ ఆయన సంచలనం సృష్టించారు. అందులోని హామీలను 90 శాతానికి పైగా కార్యరూపంలోకి తెచ్చారు. చరిత్రలో ఇప్పటిదాకా ఏ ప్రభుత్వమూ చేయలేని సాహసోపేతమైన పనిని జగన్ చేశారు.
అదేంటంటే.. తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కాపీని- దానితో పాటు అందులో అమలుచేసిన హామీల వివరాలను మరో కరపత్రంగా ముద్రించి ఇంటింటికీ అందేలా చూశారు జగన్.
రాబోయే ఎన్నికలకు తన పార్టీకి మేనిఫెస్టో అవసరం లేదు.. ఈ నాలుగేళ్ల పనితీరును ప్రతిబింబించే ప్రోగ్రెస్ రిపోర్టు ప్రచురించి.. దానిని పంచిపెడితే చాలు అనే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి దూకుడు కనిపిస్తోంది. అదే ఆయన వ్యూహం కావొచ్చునని కూడా పలువురు భావిస్తున్నారు.
చంద్రబాబునాయుడు మినీ మేనిఫెస్టో అంటూ.. అలవిమాలిన మాయమాటలను ప్రకటించినా.. జగన్ ఏమాత్రం రెచ్చిపోలేదు. ఆ హామీల తరహాలో తాను నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు చేయలేదు. తాను చేస్తున్న సంక్షేమం తిరుగులేనిది, తనకు ప్రజల్లో ఉన్న ఆదరణ సడలనిది అనే విశ్వాసం ఉంటే తప్ప ఆ స్థిరత్వం రాదు. అందుకే జగన్ ‘ఓన్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్.. నో మేనిఫెస్టో’ అనే తరహా నినాదంతో ఈ ఎన్నికలను ఎదుర్కొనబోతున్నట్టుగా కనిపిస్తోంది.
ప్రజలను మాయ చేయాలనుకునే వారికి అనేక రకాల మాటలు కావాలి. కానీ కార్యశీలురకు మాటల అవసరం తక్కువే ఉంటుంది. బురిడీ కొట్టించాలంటే.. కొత్త కొత్త హామీల అవసరం! తన కార్యదీక్షను ప్రజల ఎదుట నిరూపించుకున్న జగన్మోహనరెడ్డికి అవి తప్పనిసరి కాదు.
.. ఎల్. విజయలక్ష్మి