సినిమా వాళ్లు ఎక్కువగా జనం మధ్యకు రాకూడదు, ఎక్కువగా జనం మధ్యకు వచ్చే కొద్దీ వారి అసలు స్వరూపం బయటపడుతూ ఉంటుంది. దీని వల్ల అప్పటి వరకూ తెరపై వారిని చూసిన వైనానికి విరుద్ధమైన వారి తీరు బయటపడితే ప్రేక్షకుల ముందు వారు పలచన అవుతారు! ఇది సినిమా వాళ్లు చాలా దశాబ్దాలుగా పాటిస్తున్న నియమం.
హాలీవుడ్ తో మొదలు పెడితే ఏ సినిమా పరిశ్రమ విషయంలో అయినా ఈ నియమాన్ని కొనసాగిస్తూ ఉంటారు నటీనటులు. ఈ నియమాన్ని ఉల్లంఘించి ప్రజల మధ్యకు వచ్చి తమ పరపతిని నిలబెట్టుకున్న వారు చాలా అరుదు కూడా! అందుకే.. సినిమాను హీరోలను నిజజీవితంలో కూడా హీరోలు అనుకునే తత్వం క్రమంగా పోయింది. వారు కూడా సాధారణమైన మనుషులనే విషయం జనాలకు స్పష్టత వచ్చింది. ఫలితంగా సినిమా నటులు తెరపై కనిపిస్తేనే హారతులు పట్టే రోజుల నుంచి.. వారిని సీఎంలుగా చేసుకున్న స్థాయి నుంచి… స్టార్ హీరోలను కనీసం ఎమ్మెల్యేలుగా గెలిపించడంపై కూడా ఆసక్తి లేని వరకూ వచ్చింది పరిస్థితి!
ప్రత్యేకించి సినిమా స్టార్ హీరోలను సీఎంలుగా చేసుకునే సంప్రదాయాన్ని ఒక దశలో కలిగి ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు అదే స్టార్లు రాజకీయాల్లోకి వచ్చి అపసోపాలు పడుతున్నారు. తమ గురించి తాము ఎక్కువ అంచనాలు వేసుకుని.. కింగులం కాకపోయినా, కనీసం కింగ్ మేకర్ల కాగలమనే అంచనాలను కూడా అందుకోలేక వారు అభాసుపాలవుతున్నారు. దీంతో తమ అక్కసు తీరక అల్లరిచిల్లరగా కూడా మాట్లాడుతున్నారు. ప్రజలు తమను తిరస్కరిస్తున్నారు, రాజకీయంగా ఆదరించే పరిస్థితి లేదనే విషయాన్ని తెలుసుకుని విజ్ఞతతో తప్పుకున్నా జాబితాలో.. చిరంజీవి, రజనీకాంత్, ఉపేంద్ర, కమల్ హాసన్, విజయ్ కాంత్ నిలుస్తున్నారు.
రాజకీయంగా ఒక ట్రయల్ వేద్దామని ఈ స్టార్ హీరోలంతా ప్రయత్నించారు. చిరంజీవి సొంత పార్టీ పెట్టాడు, ఒక ఎన్నిక తర్వాత విలీనంతో బరువు దించుకున్నాడు. రజనీకాంత్ కు ఆశలు చాలానే ఉన్నా.. వయసు సహకరించపోవడం ఒక కారణం అయితే, ప్రజాదరణ పొందకపోతే పరువు పోతుందనే భావనతో అదిగో ఇదిగో అని ప్రకటించి పొలిటికల్ ఎంట్రీ నుంచి డ్రాప్ అయ్యాడు. ఇక కమల్ హాసన్ కు కూడా ఒక ఎన్నికల తర్వాత తత్వం బోధపడింది. మూడు నాలుగు శాతం ఓట్లను పెంచుకునేంత కష్టం తను పడలేనన్నట్టుగా పార్టీ ఉన్నా లేనట్టుగా సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు. పార్టీ పెట్టిన పక్షం రోజులకే ఉపేంద్రకు రాజకీయం అంటే ఏమిటో అర్థం అయ్యింది. తను పెట్టిన పార్టీకి తనే రాజీనామా ఇచ్చి వచ్చాడు. ఇక రాజకీయంలో కొన్ని డక్కామొక్కీలు తిని ఒక దశాబ్దం పాటు అందులో కొనసాగినా విజయ్ కాంత్ కు అంతకు మించి సాధ్యం కాలేదు. చివరకు ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచి.. పరువు పోగొట్టుకుని కామ్ అయ్యాడు విజయ్ కాంత్.
మరి ఆ స్టార్ హీరోల అనుభవాల కన్నా పవన్ ట్రాక్ రికార్డు ఏమంత గొప్పగా లేదు! తేడా ఏమిటంటే ఆ స్టార్ హీరోలకు కాస్త విజ్ఞత అయినా వచ్చింది. ఎందుకంటే వారంతా వారసత్వాలతోనో, అన్నను అడ్డు పెట్టుకుని ఎదిగిన వారు కాదు. సొంతంగా ఎదిగారు. దీంతో ప్రజల స్పందన ఏమిటనేది వారికి అర్థమయ్యింది. అయితే పవన్ అలా కాదు. తన అన్న లేకపోతే.. ఎందుకూ కొరగాని ఒక ఆకతాయి పవన్ కల్యాణ్. అందుకే ఒకటి రెండు చోట్ల ప్రజలు తనను ఓడించినా.. రాజకీయాల్లోకి వచ్చి 15 యేళ్లు అవుతున్నా.. కనీసం ఇంకా ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయినా.. తన గురించి తను అతిగా మాట్లాడుకోవడం, అడ్డగోలుగా మాట్లాడటం, అనుచితంగా మాట్లాడటం పవన్ కల్యాణ్ కు అలవాటుగా కొనసాగుతూ ఉంది.
ఓడిపోయాడు కాబట్టి.. పవన్ కల్యాణ్ ఆ స్టార్ హీరోల మాదిరిగా రాజకీయాలను వదిలేయాలని ఎవ్వరూ అనరు. ఆయనకు ఓపిక ఉంటే కష్టపడవచ్చు. అయితే పవన్ మాటల్లో, చేతల్లో కష్టం కనపడదు. కేవలం అక్కసు ధ్వనిస్తుంది. పవన్ ఇప్పటి వరకూ తన విజయం కోసం ఎక్కడా కష్టపడలేదు. కేవలం ఎవరినో ఓడించాలనే ధోరణితోనే ఆయన రాజకీయ పయనం కొనసాగుతూ ఉంది! పవన్ సినిమాల్లోనే ఈ ధోరణి కరెక్ట్ కాదనే డైలాగులు ఉంటాయి. నువ్వు గెలవాలనుకో, వేరే వాడు ఓడిపోవాలనుకోకు.. తరహాలో పవన్ కల్యాణ్ హీరో పాత్రలో వేరే క్యారెక్టర్లకు నీతులు చెబుతాడు. తన జీవితంలో మాత్రం తను గెలవకపోయినా ఫర్వాలేదు.. జగన్ ఓడిపోవాలని పవన్ కల్యాణ్ కోరుకుంటూ ఉన్నాడు. ఇందుకోసం చంద్రబాబు చేతిలో పావుగా మారడానికి అయినా, ఎంతలా పరువు పోగొట్టుకోవడానికి అయినా.. పవన్ కల్యాణ్ వెనుకాడటం లేదు.
చిరంజీవి అయినా, ఎన్టీఆర్ అయినా, కమల్ ఇంకా ఉపేంద్ర అయినా.. ఫలానా పార్టీని ఓడిస్తాం, ఫలానా నేతను ఇంటికి పంపుతామనే ఉద్దేశాలతో రాజకీయాల వైపు చూడలేదు. ప్రజలు తమను ఆదరించాలని వారు కోరుకున్నారు. ప్రజలు వారి పట్ల తమ స్పందనలను తెలియ జేశారు. అయితే వారందరి కన్నా భిన్నంగా పవన్ కల్యాణ్.. అనుచిత ప్రేలాపనలు చేస్తూ సాగుతున్నాడు. మరి ఇందుకు తగిన స్పందననే పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎదుర్కొనాల్సి ఉంటుందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. బహుశా వచ్చే ఎన్నికల్లో తనకు దిమ్మతిరిగే ఫలితాలు ఎదురైతే అప్పటికి పవన్ కల్యాణ్ ఒక దారికి రావొచ్చు!