ప్రత్యర్థులపై సినీ డైలాగ్‌లతో పంచ్‌లు విసరడంలో మంత్రి రోజాది ప్రత్యేక శైలి. అదే రోజాపై ఆమెను మించిపోయేలా తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సెటైర్స్ విసిరారు. బుధవారం రోజా మీడియాతో మాట్లాడుతూ ఏ చీర పంపాలో చెప్పయ్యా చంద్రబాబూ అని వెటకరించిన సంగతి తెలిసిందే. ఇవాళ రోజాకు దీటైన సమాధానం తెలుగు మహిళ నుంచి రావడం విశేషం.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి గురించి మాట్లాడితే ఊరుకోమని రోజా అనడంపై అనిత మండిపడ్డారు. మాట్లాడితే ఏం చేస్తావని ప్రశ్నించారు. ఆడబిడ్డల్ని రక్షించలేని అసమర్థ సీఎం జగన్ గురించి తాము ఇలాగే మాట్లాడ్తామన్నారు. మీరిచ్చే వార్నింగ్లకి జడిసి గజగజ వణికిపోయే వాళ్లు ఎవరూ లేరన్నారు. చంద్రబాబు, లోకేశ్‌లను విమర్శిస్తే మాత్రం మిమ్మల్ని బయటికి లాగి బండారం బయటపెట్టేందుకు తెలుగు మహిళ సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు.
ఒక అనూష, వరలక్ష్మి, తేజశ్విని, స్నేహలత, నాగమ్మ, రమ్య… ఇంత మంది ఆడబిడ్డల్ని నడిరోడ్డుపై పొడిచి చంపుతుంటే ఒక్కసారి కూడా మాట్లాడ్డానికి సాహసం చేయలేని నీ సీఎం జగన్మోహన్రెడ్డి ఏ చీర కట్టుకోవాలో చెప్పమ్మా రోజమ్మా? అని నిలదీశారు. చివరికి సొంత నియోజకవర్గంలో ఓ మహిళకు అన్యాయం జరిగినా నోరు మెదపలేని స్థితిలో నీ సీఎం వుంటే… ఏ రంగు చీర పంపాలో ఆలోచించుకో అని రోజాకు ఘాటుగా రిప్లై ఇచ్చారు.
సొంత చెల్లి న్యాయం కోసం ఢిల్లీ నడివీధుల్లో తిరుగుతోందని, మరి జగన్‌కు ఏ రంగు చీర పంపాలో చెప్పాలని అనిత డిమాండ్ చేశారు. అలాగే విశాఖలో సొంత తల్లిని గెలిపించుకోలేని సీఎం జగన్‌కు ఏ రంగు చీర పంపాలో చెప్పాలని రోజాపై ప్రశ్నల వర్షం కురిపించారు. తాము బూతులు మాట్లాడుతున్నామని మంత్రి రోజా విమర్శిస్తుంటే షాక్‌కు గురవుతున్నట్టు అనిత వెటకరించారు.
అసెంబ్లీ వేదికగా, ప్రెస్మీట్లు వేదికగా, పబ్లిక్ మీటింగ్‌లు వేదికగా, ఎక్కడ పడితే అక్కడ బూతులు మాట్లాడ్డమే ధ్యేయంగా పెట్టుకుని ఇష్టానుసారంగా చంద్రబాబు, లోకేశ్‌ను, తమను విమర్శించే సంస్కృతి వైసీపీదే అన్నారు. బూతులు మాట్లాడ్డంలో మిమ్మల్ని మించినోళ్లు లేరన్నారు. అలాంటి వాళ్లు తమ గురించి మాట్లాడ్డం విడ్డూరంగా ఉందన్నారు.