పదో తరగతి పరీక్ష పత్రాల లీకుల పర్వం సాగుతూ ఉంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు బుధవారం మొదలయ్యాయి. మొదటి రోజే తెలుగు ప్రశ్నాపత్రం లీకైంది. రెండో రోజు హిందీ ప్రశ్నాపత్రం కూడా లీకు కావడంపై సర్వత్రా ప్రభుత్వాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు.
మొదటి రోజు జరిగిన తప్పును సరిదిద్దుకోకపోగా, మరుసటి రోజు కూడా అదే పంథా కొనసాగడం ప్రభుత్వ విద్యాశాఖ వైఫల్యానికి నిదర్శనమని తల్లిదండ్రులు, విద్యార్థులు విమర్శిస్తున్నారు.
రెండోరోజు హిందీ ప్రశ్నాపత్రం శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో లీక్ అయినట్టు పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుండడం గమనార్హం. మొదటి రోజు తెలుగు ప్రశ్నాపత్రం పరీక్ష మొదలైన అర్థగంటకే బయటికొచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు ప్రశ్నాపత్రం లీక్ వెనుక ఓ కార్పొరేట్ స్కూల్ హస్తం ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు.
మొదటి రోజు పరీక్షల నిర్వహణలో లోపాలను గుర్తించి, లీకుల ఆరోపణలకు అవకాశం లేకుండా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటారని అంతా భావించారు. అయితే అలాంటివేవీ లేకపోగా, యధావిధిగా రెండో రోజు కూడా హిందీ ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో తాము కష్టపడి చదివి ప్రయోజనం ఏంటనే పదో తరగతి విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించి పిల్లలను చదివిస్తున్నామని, పేపర్‌ను లీక్ చేసుకుని పరీక్షలు రాస్తే, మెరిట్ విద్యార్థులు నష్టపోతారని తల్లిదండ్రులు వాపోతున్నారు.