విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటనను మరిచిపోకనే, మరొక దారుణం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి ఇందుకు వేదికైంది. వివాహితపై అత్యాచారం, అనంతరం హత్య జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.
ఇటీవల మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని వుంటే , ఇవాళ అలాంటివి పునరావృతం అయ్యేవి కాదని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. తుమ్మపూడికి చెందిన మహిళ పొలాలకు నీళ్లు పెట్టుకునే పైపులను అద్దెకిస్తూ జీవనం సాగించేది. ఈమె భర్త తిరుపతిలో పనిచేస్తూ, అప్పుడప్పుడూ భార్య దగ్గరికి వచ్చి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆమెపై ఇంట్లోనే అత్యాచారం, హత్య జరగడం సంచలనం రేకెత్తిస్తోంది.
ఈ విషయమై గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహంపై రక్కిన, కొరికిన గాయాలున్నట్టు పోలీసులు గుర్తించారు. అలాగే వివస్త్రగా ఉండడంతో సామూహిక అత్యాచారం జరిగినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇదిలా వుండగా మృతురాలి భర్త నలుగురిపై అనుమానాలు వ్యక్తం చేశాడు.
ఇటీవల తన భార్యను వేధిస్తున్నట్టు పోలీసులకు వివరించాడు. వారే ఈ దారుణానికి పాల్పడి వుంటారని ఆవేదన వ్యక్తం చేశాడు. సంఘటన స్థలాన్ని టీడీపీ నేతలు సందర్శించారు. ప్రభుత్వ అలసత్వం, నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని విమర్శించడం గమనార్హం.