'చట్ట సభలే సుప్రీం.. చట్ట సభలకు సంబంధించి స్పీకర్ నిర్ణయమే ఫైనల్.. చట్ట సభల వ్యవహారాల్లో ఏ న్యాయస్థానాలూ జోక్యం చేసుకోలేవు..'
– ఇది తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన మాట.
తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలే కాదు, కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ కూడా వీలు చిక్కినప్పుడల్లా చట్ట సభల పేరు చెప్పి, న్యాయవ్యవస్థను ప్రశ్నించడం, ఒక్కోసారి న్యాయవ్యవస్థను బెదరించేలా మాట్లాడడం చూస్తూనే వున్నాం.
కానీ, ఇక్కడ సీన్ మారింది. ఇది తమిళనాడు సంగతి.! తమిళనాడులో గత కొంతకాలంగా నెలకొన్న రాజకీయ సంక్షోభం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇటీవల తమిళనాడు స్పీకర్ 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేశారు. ఆ వేటు విషయమై మద్రాస్ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పేరు చెప్పి 18 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరపకూడదని పేర్కొంది. అంతేనా, విశ్వాస పరీక్ష కూడా నిర్వహరించరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
అసలంటూ అనర్హత వేటు వేసిందే, విశ్వాస పరీక్షలో నెగ్గడానికి. పళనిసామి ప్రభుత్వం, తగినంత మెజార్టీ లేకపోవడంతో వ్యూహాత్మకంగా తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన విషయం విదితమే. ఆ వేటుని, వేటు పడ్డ ఎమ్మెల్యేలు సవాల్ చేయడంతో వ్యవహారం రంజుగా మారిందిప్పుడు.
చట్ట సభల్లో జరిగే అంశాలపై న్యాయస్థానాల పెత్తనమేంటని తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు గుస్సా అయితే, తమిళనాడులో పరిస్థితి ఇందుకు భిన్నంగా కన్పిస్తోంది. విశ్వాస పరీక్ష జరగాల్సిందేనంటే టెన్షన్‌గానీ, ఆ పరీక్ష జరగకపోతే అసలంటూ పళనిసామి సర్కార్‌కి ఇప్పటికిప్పుడు వచ్చే ముప్పేమీ లేదనుకోండి.. అది వేరే విషయం.
ఒక్కటి మాత్రం నిజం, స్పీకర్ విచక్షణాధికారాల పేరుతో వ్యవస్థల్ని సర్వనాశనం చేసేస్తున్నాయి అధికారంలో వున్న పార్టీలు. ఇలాంటి సందర్భాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకునే పరిస్థితి లేకపోతే, అసలు ప్రజాస్వామ్యానికి అర్థమేముంటుంది.? నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయించేసి, మంత్రి పదవులు కూడా పొందుతున్నారు సోకాల్డ్ ప్రజా ప్రతినిథులు. పార్టీ మారగానే అనర్హత వేటు పడి తీరాల్సిందే. దురదృష్టవశాత్తూ ఆ పరిస్థితి దేశంలో 'అధికార పార్టీల అవసరం మేరకు' మాత్రమే జరుగుతుండడం గమనార్హం. ఇలాంటి సందర్భాల్లోనే న్యాయస్థానాల జోక్యం అత్యవసరం అన్పిస్తుంటుంది.