ఎంపీగారు జోకేశారు

తెలంగాణ‌లో మ‌రో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో రాజ‌కీయ విమ‌ర్శ‌లు ప‌దునెక్కాయి. ఈ నేప‌థ్యంలో తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌ను నియ‌మించుకోవ‌డం, ఆయ‌న కాంగ్రెస్‌లో చేరాల‌ని…

తెలంగాణ‌లో మ‌రో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో రాజ‌కీయ విమ‌ర్శ‌లు ప‌దునెక్కాయి. ఈ నేప‌థ్యంలో తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌ను నియ‌మించుకోవ‌డం, ఆయ‌న కాంగ్రెస్‌లో చేరాల‌ని నిర్ణ‌యించుకుని చివ‌రి నిమిషంలో విర‌మించుకోవ‌డం త‌దిత‌ర ప‌రిణామాలు బీజేపీకి ఆయుధం ఇచ్చిన‌ట్టైంది. 

కాంగ్రెస్‌, టీఆర్ఎస్ మ‌ధ్య పొత్తు కుదురుతోంద‌ని, వార‌ధిగా ప్ర‌శాంత్ కిషోర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని బీజేపీ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి టీఆర్ఎస్‌తో పొత్తుపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 

టీఆర్ఎస్‌తో పొత్తు ఉండ‌ద‌ని అన్నారు. సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ న‌మ్మ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. పొత్తు కోసం సోనియాగాంధీని కేసీఆర్ అడిగార‌న్నారు. కానీ మా వాళ్లు ఒప్పుకోలేద‌ని కోమ‌టిరెడ్డి జోకేశారు. గెలిచే ప‌రిస్థితిలో ఉన్నందునే కాంగ్రెస్ పార్టీపై ప్లీన‌రీలో కేసీఆర్ విమ‌ర్శ‌లు చేయ‌లేద‌ని చెప్పుకొచ్చారు. 

గ‌తంలో కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను విలీనం చేస్తాన‌ని చెప్పి, ఆ త‌ర్వాత మోసం చేశార‌ని కేసీఆర్‌పై మండిప‌డ్డారు. అలాగే టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డికి కూడా ఆయ‌న హిత‌వు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో “నేను” అంటే గోవిందా అని, మేము అన‌డం నేర్చుకోవాల‌ని కోరారు. వ‌రంగ‌ల్‌లో రాహుల్ స‌భ‌కు ఒక్క‌డే ల‌క్ష‌ల మందిని స‌మీక‌రించ‌గ‌ల‌రా? అని ప్ర‌శ్నించారు. 

భ‌ట్టి విక్ర‌మార్క క‌ష్ట‌మైనా, న‌ష్ట‌మైనా తెలంగాణ వ్యాప్తంగా పాద‌యాత్ర చేయాల‌ని కోరారు. భ‌ట్టికి సీనియ‌ర్ల మ‌ద్ద‌తు ఉంటుంద‌న్నారు. భ‌ట్టి పాద‌యాత్ర అనుమ‌తి కోసం అవ‌స‌ర‌మైతే అధిష్టానానికి లేఖ రాస్తామ‌న్నారు.