కొత్త జిల్లాల విభజనలో విశాఖ కేవలం ఆరు అసెంబ్లీ సీట్లతో చిన్నదైపోయింది. పైగా ఇందులో నాలుగు సీట్లు టీడీపీ వారే గెలుచుకున్నారు. దాంతో టీడీపీకి పట్టున్న జిల్లాగా దీన్ని రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. టీడీపీ ధైర్యం కూడా అదే అంటున్నారు.
దాంతో విశాఖ మీద వైసీపీ ఫుల్ ఫోకస్ పెట్టేసింది. ఈసారి ఆరుకు ఆరు అసెంబ్లీ సీట్లు గెలుచుకోవాల్సిందే అని జగన్ పార్టీ నాయకులకు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక విశాఖలో వైసీపీలో విభేదాలు, గొడవలు అన్నీ పక్కన పెట్టి ఒక్కటి కావాలని కూడా జగన్ ఆదేశించినట్లుగా చెబుతున్నారు.
విశాఖ జిల్లా వైసీపీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని అసలు సహించేది లేదని నేతలను జగన్ గట్టి హెచ్చరికలనే పంపించారు. కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని స్పష్టం చేయడంతో విశాఖ జిల్లా నేతలు దారికి రావడమే ఇక అని చెబుతున్నారు. అలాగే కొత్త ప్రెసిడెంట్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు నాయకత్వంలో అంతా పనిచేయాల్సిందే అని కూడా అధినేత స్పష్టం చేస్తున్నారు
మొత్తానికి విశాఖ మీద జగన్ కి మోజు ఉంది. ఈ జిల్లా ఇప్పటికి రెండు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి పూర్తిగా దక్కకుండా చిక్కకుండా పోతోంది. ఈసారి ఎలాగైనా విశాఖను ఒడిసిపట్టాలని వైసీపీ హై కమాండ్ గట్టి పట్టుదలతో ఉంది.
ఇక తేడా పాడా వస్తే సహించేది లేదని అధినాయకత్వం క్యాడర్ కి గట్టి సందేశమే పంపుతోంది. మరి దాన్ని గమనించి అంతా ఉద్యమ స్పూర్తితో రంగంలోకి దిగితే విశాఖ ఫ్యాన్ నీడకు చేరవచ్చేమో.