‘ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి’ అంటూ ఆచార్య ఆత్రేయ ఒక పాటలో లోకరీతిని వివరించారు. ఇప్పుడు ఆ లోకరీతికి తాను భిన్నం కాదని.. నరేంద్రమోదీ నిరూపించుకుంటున్నారు. కొవిడ్ తీవ్రతకు సంబంధించిన అంశాలను సమీక్షించడానికి దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన సమావేశం పెట్టుకుని, ఆ సమావేశాన్ని తన రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు.
పెట్రోలు ధరలు పెరగకుండా రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలంటూ ఆయన హితవు చెప్పారు. తద్వారా.. గతంలో ఆయన ఇచ్చిన పిలుపును పట్టించుకోని భాజపాయేతర పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలని ఆత్మరక్షణలో పడేయడానికి ఆయన ఒక చీప్ ట్రిక్ ప్రయోగించినట్లు అయింది.
పెట్రోలు ఉత్పత్తుల ధరలను కేంద్రం అడ్డగోలుగా పెంచుతూ ఉంటుంది. ఒకవైపు అలా పెంచుతూ.. కేంద్రం పరువు పోతున్నదనే ఉద్దేశంతో, భయంతో.. అయిదు రాష్ట్రాల ఎన్నికలకు కొంత కాలం ముందు.. కొంత మేర పన్నులను కేంద్రం తగ్గించింది. రాష్ట్రాలు కూడా ఈ మేరకు పన్నులు తగ్గించాలని పిలుపు ఇచ్చింది.
బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ డూడూ బసవన్నల్లాగా కేంద్రం చెప్పిన పనిచేశాయి. మిగతా రాష్ట్రాలు చేయలేదు. చేసినా సరే.. అది తమ వలనే చేశారని చాటుకుంటూ.. బిజెపి పొలిటికల్ మైలేజీ పొందుతుంది గనుక.. వారు పట్టించుకోలేదు. ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర వాటా పన్నులు తగ్గించాలంటూ.. బిజెపి శ్రేణులు కొంత యాగీ చేసి.. ఆ మైలేజీ చాలనుకుని అక్కడితో ఊరుకున్నాయి.
తీరా ఇప్పుడు నరేంద్రమోడీ.. ఇవాళ మళ్లీ అదే పాట పాడుతున్నారు. ఆయనేమో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కొవిడ్ విషయాలు చర్చించడానికి మీటింగు పెట్టుకున్నారు. ఆ మీటింగులో తన పొలిటికల్ మైలేజీ పాట ఎత్తుకున్నారు. రాష్ట్రాలు పెట్రోలుపై పన్నులు తగ్గించాలని పిలుపు ఇచ్చారు. బీజేపీయేతర పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో కూడా తమ పార్టీ మీద ప్రజల్లో ప్రేమను తయారు చేయడం ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారం చూస్తే ఎదుటివారికి నీతులు చెప్పడానికే ఆయన ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
మోడీకి నిజంగా ప్రజల కష్టాల మీద అంత ప్రేమే ఉంటే గనుక.. పెట్రోలు ధరలను మరింతగా నియంత్రించవచ్చు. లేకపోతే.. పెట్రోలియం ఉత్పత్తులను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావచ్చు. అదే జరిగితే ధరలు బాగా తగ్గుతాయి. ప్రజలందరూ మోడీ సర్కారుకు జై కొడతారు.
రాష్ట్రాలు సుమారు 4–5 వేల కోట్ల రూపాయలను అదనపు పన్నుల రూపేణా దండుకుంటున్నాయని అంటున్న మోడీ, అదే కేంద్రం లక్షల కోట్ల రూపాయలను పన్నులుగా దండుకుంటున్నదని ఎందుకు మర్చిపోతున్నారు. ఒకవేలెత్తి ఎదుటివారి తప్పులు చూపితే.. వారందరూ కూడా తలో వేలూ ఎత్తి.. కేంద్రం ఎంత దందా సాగిస్తున్నదో నిలదీస్తారనే స్పృహ ఆయనకు లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
కరోనా కోసం పెట్టిన సమావేశంలో పెట్రోలు చర్చ తేవడమే ఒక నీతిబాహ్యమైన చర్య. కాకపోతే ఇదంతా కూడా కేంద్రం వైఫల్యాలను చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోడానికి ప్రజలను డైవర్ట్ చేసే సంకుచితమైన టెక్నిక్ లుగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
మా జగన్ మాత్రం ఆన్ని శ్రి రంగ నీతులు చెపొచ్చు అంటావ్!
Yenni neethulu chepina india develope kosam gujarath kosam kadhu